వేతనాలు పెంచాలి
● యాప్‌ల భారం తగ్గించాలి
● అంగన్‌వాడీల డిమాండ్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కార్యకర్తలకు వెంటనే వేతనాలు పెంచాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్‌కు వినతిపత్రం అందజేశారు. ఆరేళ్లుగా వేతనాలు పెరగలేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం తక్షణం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ మినీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ ఆదేశాలు మాత్రమే ఇచ్చారని, మెయిన్ సెంటర్ సిబ్బంది వేతనాలను వెంటనే మినీలకు కూడా చెల్లించాలని కోరారు. యాప్‌ల పేరుతో పెంచిన పని భారం తగ్గించాలని, అన్నింటినీ కలిపి ఒకే యాప్‌గా మార్చాలని, అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాలల్లో విలీనం చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనానంతరం అంగన్‌వాడీ చిన్నారులకు స్నాక్స్ వెంటనే పునరుద్ధరించేందుకు బడ్జెట్ పెంచాలని కోరారు. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు అనేక హామీలు, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం తప్ప, అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు దశల వారీ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ధర్నాలో యూనియన్ కార్యదర్శి ఏరుబండి చంద్రవతి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దువ్వా శేషుబాబ్జీ, చెక్కల రాజ్‌కుమార్, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.


