అన్నింటా మహిళల ముందంజ
కాకినాడ రూరల్: అన్ని రంగాల్లో మహిళలు ముందంజ వేస్తున్నారని, ముఖ్యంగా పాఠశాలల నుంచి కళాశాలల వరకూ బాలికలు, యువతుల విద్యాభ్యాసం పెరిగిందని నన్నయ యూనివర్సిటీ వీసీ, ప్రొఫెసర్ ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని నన్నయ ఎంఎస్‌ఎన్ పీజీ సెంటర్‌లో శుక్రవారం అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. పీజీ సెంటర్ ఇంగ్లిష్ డిపార్ట్‌మెంట్ ఆధ్యర్యంలో జరిగిన సదస్సును వీసీ ప్రారంభించారు. 55 శాతం మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని వీసీ అన్నారు. సదస్సుకు వచ్చిన వివిధ కళాశాలల విద్యార్థులకు శ్రీలంకకు చెందిన డాక్టర్ జేఎస్ రోహన్, అల్గిరీయాకు చెందిన డాక్టర్ నావెల్ ఆన్‌లైన్ ద్వారా భౌగోళిక మార్పులు, సమకాలీన సామాజిక దృక్కోణాలు, ప్రదర్శనలపై వివరించారు. ఎథియోపియా నుంచి హాజరైన ప్రొఫెసర్లు టెస్సెమా గేబ్రే కీమిసో, టెస్ఫాహున్ టెగెర్న్ సోర్సా తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. ప్రొఫెసర్లు రమేష్, జ్యోతి పలు సూచనలు అందించారు. మాణిక్‌రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ మాణిక్యరెడ్డి, లయన్ గరికపాటి నమశ్శివాయలు వీసీ ప్రశాంతిశ్రీని సన్మానించి, మహాత్మా గాంధీ సేవారత్న పురస్కారాన్ని అందజేశారు. అనంతరం సావనీర్‌ను ఆవిష్కరించారు. ఆంగ్ల విభాగాధిపతి ఎం.పోచయ్య, రాధామాధవి, డాక్టర్ శ్రీదేవి, మనోజ్‌దేవా తదితరులు పాల్గొన్నారు.


