పరిహారమేదీ?
అన్నవరం: కాకినాడ సమీపంలోని వాకలపూడి నుంచి అన్నవరం వరకూ సుమారు 41 కిలోమీటర్ల పొడవున కేంద్ర ప్రభుత్వ భారత్‌మాల రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికోసం పిలిచిన టెండర్లను త్వరలోనే ఖరారు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. అయితే, తమకు పరిహారం చెల్లించకుండానే జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రోడ్డు నిర్మాణానికి టెండర్ ఖరారు చేసే ప్రయత్నంలో ఉండటంపై అన్నవరం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.కోట్ల విలువైన భూములిచ్చిన తమకు పరిహారం విషయం తేల్చకుండా పనులు ప్రారంభిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.
రూ.1,040 కోట్లతో..
సాగరతీరం వెంబడి పారిశ్రామికాభివృద్ధి కోసం 40.621 కిలోమీటర్ల పొడవున ఎన్‌హెచ్–516ఎఫ్ పేరిట నాలుగు వరుసల్లో భారత్‌మాల పరియోజన ఫేజ్–1 రహదారి నిర్మించాలని 2020లో అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రూ.1,040 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఎన్‌హెచ్‌ఏఐ 2021లో ఒకసారి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి రద్దు చేసింది. తిరిగి గత జూలైలో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పట్లో అరవిందో రియాల్టీ కంపెనీ టెండర్ లోయెస్ట్‌గా వచ్చింది. అయితే, కొన్ని సాంకేతిక కారణాలతో ఆ టెండర్‌ను రద్దు చేసి, తిరిగి గత ఆగస్టులో మళ్లీ టెండర్ పిలిచారు. మొత్తం 9 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. వాటి సాంకేతిక అర్హతలు పరిశీలిస్తున్నారు. అనంతరం, అత్యంత తక్కువకు కోట్ చేసిన సంస్థను ఎంపిక చేసి, రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ అప్పగిస్తారు.
ఆది నుంచీ వివాదం
వాకలపూడి లైట్ హౌస్ నుంచి కాకినాడ రూరల్, యు.కొత్తపల్లి, తొండంగి మండలాల మీదుగా అన్నవరం వరకూ భారత్‌మాల రోడ్డు నిర్మించనున్నారు. దీని కోసం 2021లో అన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నవరం, ఆరెంపూడి గ్రామాల పరిధిలో 40 ఎకరాల భూమి సేకరించారు. ఇందులో 20 ఎకరాలు ప్రభుత్వ భూమి. మిగిలిన 20 ఎకరాలు ఈ రెండు గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతులకు చెందినది. రాజమహేంద్రవరం – విశాఖపట్నం మధ్య 16వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని సత్యదేవుని పాత నమూనా ఆలయ సమీపాన 20 ఎకరాల సేకరణపై అప్పట్లోనే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకున్న భూమే తక్కువని, అది కూడా రోడ్డుకు తీసేసుకుంటే తామెలా బతకాలని ఆవేదన చెందారు.
వారికి ఎస్.. వీరికి నో..
ఆరెంపూడి గ్రామ పరిధిలో సర్వే నంబర్లు 177, 105, 108లలోని 20 మంది రైతుల నుంచి సుమారు 10 ఎకరాలు సేకరించారు. దీనికి గాను ఎకరాకు రూ.కోటి చొప్పున ఎన్‌హెచ్‌ఏఐ చెల్లించింది. అదే ప్రాంతంలో అన్నవరం గ్రామ పరిధిలో సర్వే నంబర్ 91–1లో మరో 20 మంది రైతుల నుంచి ఇంకో 10 ఎకరాలు సేకరించారు. వారికి మాత్రం ఇప్పటి వరకూ పరిహారం చెల్లించలేదు. గ్రామం పేరు, సర్వే నంబర్లు మారడంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల కొర్రీలు వేసినట్లు సమాచారం. మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వాస్తవానికి అన్నవరంలో హైవేను ఆనుకుని ఎకరం భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.4 కోట్లు పలుకుతోంది. తమకు పరిహారం ఇవ్వకుండా ఇప్పుడు రోడ్డు నిర్మాణానికి టెండర్ ఖరారు చేస్తూండటంతో వారు ఆందోళన చెందుతున్నారు.
· ¿êÆý‡™ŒæÐ]l*ÌS Æøyýl$z ˘
నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు
ఫ త్వరలో టెండర్ ఖరారు!
ఫ 2 గ్రామాల్లో 20 ఎకరాల సేకరణ
ఫ ఆరెంపూడి రైతులకు చెల్లింపు
ఫ అన్నవరంలో భూములిచ్చిన
వారికి అందని పరిహారం
ఫ రెండేళ్లుగా కానరాని పరిష్కారం
అక్కడ సర్కులర్ ఫ్లై ఓవర్
వాకలపూడి – అన్నవరం భారత్‌మాల రోడ్డు అన్నవరం వద్ద సత్యదేవుని నమూనా ఆలయ సమీపాన 16వ నంబర్ జాతీయ రహదారితో కలుస్తుంది. అక్కడ కత్తిపూడి హైవే సర్కిల్ మాదిరిగా అతి పెద్ద సర్కులర్ ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. ఆ సర్కిల్ నుంచి చూస్తే రత్నగిరిపై సత్యదేవుని ఆలయం కనిపిస్తుంది. అందువలన ప్రయాణికులు ఆగేందుకు వీలుగా కూడా ఈ నిర్మాణం జరుగుతుందని చెబుతున్నారు.


