
రత్నగిరికి భక్తుల తాకిడి
ఫ సత్యదేవుని దర్శించిన 50 వేల మంది
ఫ దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి శుక్రవారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. దసరా సెలవులు ముగియడంతో స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న వారితో పాటు ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. దీనికి తోడు గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులు కూడా సత్యదేవుని సన్నిధికి తరలి వచ్చారు. దీంతో, సత్యదేవుని ఆలయం, ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్త గోకులంలో ఏడు గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణునికి పూజలు చేశారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. శని, ఆదివారాల్లో కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండనుంది. స్వామి, అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో శనివారం తిరుచ్చి వాహనం మీద, ఆదివారం టేకు రథ పైన ఉదయం 10 గంటలకు ఊరేగిస్తారు. విజయ దశమి పర్వదినం సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన వేలాది మంది ఉత్తరాంధ్ర జిల్లాల భక్తులు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ఆగారు. రత్నగిరి తొలి పావంచా వద్ద కొబ్బరి కాయలు కొట్టి సత్యదేవుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తొలి పావంచా వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. భక్తులు తమ వాహనాలను మెయిన్ రోడ్డుపై నిలిపివేయడంతో పలుమార్లు ట్రాఫిక్ స్తంభించిపోయింది.