
రైలు ఢీకొని జార్ఖండ్ వాసి మృతి
తుని: అన్నవరం రైల్వేస్టేషన్ ట్రాక్‌పై గుర్తుతెలియని రైలు ఢీకొని జార్ఖండ్ వాసి మృతి చెందిన ఘటన గురువారం జరిగిందని సామర్లకోట రైల్వే సబ్ ఇన్‌స్పెక్టర్ పి.వాసు తెలిపారు. మృతుని వద్ద తుని రైల్వే హెడ్ కానిస్టేబుల్ మోహన్‌రావుకు దొరికిన ఆధారాలను బట్టి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన హోనార్ గ్రామానికి చెందిన సులం పాన్(25)గా తెలిసింది. మృతుడికి తండ్రి మంగళ్‌సింగ్ పాన్, తల్లి, ముగ్గురు తమ్ముళ్లు, చెల్లి ఉన్నట్టు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కొంతకాలం నుంచి మానసికంగా మృతుడు ఇబ్బంది పడుతున్నట్టు వివరించారు. సుమారు నెలక్రితం చేపల చెరువు వద్ద ప్యాకింగ్ నిమిత్తం వచ్చినట్టు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.