
ప్రాణ సంకటంగా బాణసంచా
రాయవరం: దీపావళి పండగ అంటే చిన్నా, పెద్దా అందరికీ ఆనందమే. ఈ నెల 21న దీపావళి పర్వదినం జరుపుకొనేందుకు జనం సన్నద్ధమవుతున్నారు. అయితే జీవితంలో వెలుగులు నింపాల్సిన దీపావళి పండగ..కొందరి స్వార్థంతో చీకట్లును తెస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా, అజాగ్రత్తగా బాణసంచా తయారీ, నిల్వలు చేస్తుండడంతో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా ఇలాంటి దుర్ఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. దీపావళి పండగ అంటేనే బాణసంచా కాల్చడం. లైసెన్స్ పొందినవారు బాణసంచా తయీరీలో నిమగ్నమయ్యారు. అధికారికంగా బాణసంచా తయారీ చేసే వారికంటే అనధికారికంగా చేసేవారు ఎక్కువ. గతంలో అధికారికంగా బాణసంచా తయారీ చేసే కేంద్రాలతో పాటు అనధికారికంగా బాణసంచా తయారీ చేసే చోట కూడా ప్రమాదాలు సంభవించి అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి.
45 వరకు బాణసంచా తయారీ కేంద్రాలు
దీపావళికే కాక పలు సందర్భాల కోసం బాణసంచా తయారు చేస్తుంటారు. ప్రస్తుతం దీపావళికి బాణసంచా తయారు చేసే పనిలో జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని వేట్లపాలెం, జువ్విపాడు, ద్రాక్షారామ, వేళంగి, రాయవరం, వి.సావరం, కొమరిపాలెం, బిక్కవోలు, మండపేట తదితర ప్రాంతాల్లో తయారీ కేంద్రాలున్నాయి. ఏడాది పొడవునా ఇక్కడి వ్యాపారులకు చేతినిండా పని ఉంటుంది. బాణసంచా తయారీ కోసం ఫారమ్ 20, కేవలం అమ్మకం కోసం ఫారమ్ 24 జారీ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50కి పైగా లైసెన్స్‌డ్ తయారీ కేంద్రాలు ఉన్నాయి.
అతి పెద్ద ఘటన అదే
బాణసంచా తయారీ సందర్భాల్లో అనేక ప్రమాదాలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. జిల్లాలోని మండపేట, జువ్విపాడు, ద్రాక్షారామ, కొమరిపాలెం, రాయవరం, బిక్కవోలు, యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప తదితర చోట్ల బాణసంచా కేంద్రాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే వాకతిప్పలో 2014 అక్టోబర్ 22వ తేదీన చోటు చేసుకున్న ఘటన జిల్లాలోనే అతి పెద్ద దుర్ఘటనగా చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాద ఘటన అనేక లోపాలను ఎత్తిచూపింది. గతేడాది మండపేట మండలం ఏడిదలో దీపావళి ముందు రోజు జరిగిన దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో తాము నిర్వహిస్తున్న కిరాణా షాపులో బాణసంచా పేలి భార్యాభర్తలు కంచర్ల శ్రీనివాసరావు, సీతామహాలక్ష్మి మృతిచెందారు.
అనధికార నిల్వలతోనే..
బాణసంచా తయారీకి పేరొందిన తమిళనాడులోని శివకాశి నుంచే రాష్ట్రానికి ఎక్కువగా సరకు దిగుమతి అవుతుంది. చైనా బాణసంచా కూడా అధికంగానే దిగుమతి చేసుకుంటున్నారు. పలువురు వ్యాపారులు దీపావళికి బాణసంచాను దిగుమతి చేసుకుని నిల్వలు పెట్టుకుంటారు. నిబంధనలు అతిక్రమించి గోడౌన్లలో నిల్వలు చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బాణసంచా గొడౌన్ ఏర్పాటు చేయాలంటే ఫారం–26 ప్రకారం అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంది. జనావాస ప్రాంతంలో బాణసంచా నిల్వలు ఏర్పాటు చేయరాదు. అగ్నిమాపక నిబంధనలు పాటిస్తూ, గ్రామ శివారు ప్రాంతాల్లోనే బాణసంచా కేంద్రాలను నెలకొల్పాలి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవేమీ పాటించకుండా కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది లైసెన్స్‌లు పొందకుండానే జనావాసాల మధ్య అవగాహన లేకుండా అనధికారికంగా బాణసంచా తయారు చేయడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
అనధికార తయారీదారులతోనే సమస్య
జిల్లాలో లైసెన్స్ పొందిన బాణసంచా తయారీదారులు కచ్చితమైన నిబంధనలు పాటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని పలువురు అనధికారికంగా జనావాసాల మధ్య బాణసంచా తయారు చేయడం వలన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీస్, ఫైర్ అధికారులు వచ్చి తరచుగా తనిఖీలు చేపడుతున్నారు.
– వి.సత్యనారాయణమూర్తి, గౌరవ అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాణసంచా తయారీ యజమానుల సంఘం, రాయవరం
రాజీపడే ప్రసక్తి లేదు
బాణసంచా తయారీ కేంద్రాలు కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి. అప్పుడే రెన్యువల్ లైసెన్స్‌లకు సిఫారసు చేస్తాం. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అధికారిక తయారీ కేంద్రాల్లో తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. అనధికారికంగా తయారు చేస్తున్నట్లుగా సమాచారం ఉంటే మా దృష్టికి తీసుకుని రావాలి.
– బి.రఘువీర్, డీఎస్పీ,
రామచంద్రపురం
బాణసంచా తయారీదారులు పాటించాల్సిన నిబంధనలు
బాణసంచా తయారీ కేంద్రం చుట్టూ 9 మీటర్ల ఖాళీ స్థలం ఉంచాలి.
అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వర్తించేందుకు అనువుగా నాలుగువైపులా 9 మీటర్ల మేర ఖాళీ స్థలం ఉండాలి.
గ్రామ పంచాయతీ, పట్టణాలకు 1.5 కిలోమీటర్లలోపు మందుగుండు సామగ్రి తయారు చేయకూడదు.
బాణసంచా తయారుచేసే ప్రదేశాల్లో అగ్నినిరోధక పరికరాలు ఉండాలి.
షెడ్ల నిర్మాణానికి ఉపయోగించే మెటిరీయల్ కనీసం రెండు గంటల పాటు అగ్నిని నిరోధంచగలగాలి.
షెడ్ల నుంచి బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గుమ్మాలు కనీసం 100 సెంటీమీటర్ల వెడల్పు, 200 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి.
తయారీ కేంద్రంలో ఆటోమెటిక్ వెంటిలేషన్ సిస్టమ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
18 ఏళ్లలోపు పిల్లలను, మహిళలను బాణసంచా తయారీకి ఉపయోగించకూడదు.
అక్కడ పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఫైర్‌ఫైటింగ్ కోర్సులో ప్రాథమిక శిక్షణ తీసుకుని ఉండాలి.
తయారీ కేంద్రం విస్తీర్ణాన్ని బట్టి 5 కిలోల సామర్థ్యం ఉన్న డ్రై పౌడర్ ఎస్టింగ్విషర్ (అగ్నిమాపక సిలిండర్)లు నాలుగు సిద్ధంగా ఉండాలి.
ఐదు ట్రక్కుల పొడి ఇసుకను కూడా ఆ ఆవరణలో సిద్ధంగా ఉంచాలి.
ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి అవసరమైన నీటి కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
మంటలు, అగ్నిని సష్టించే ద్రవ పదార్థాలు (పెట్రోలు, డీజిల్ వంటివి) ఎట్టి పరిస్థితుల్లోనూ తయారీ కేంద్రాల్లో నిల్వ ఉంచకూడదు.
తయారీ కేంద్రంలో విద్యుద్దీకరణలోను జాగ్రత్తలు పాటించాలి. వైర్లను బహిరంగంగా ఉంచకూడదు. వైర్ల జాయింట్లు ఎక్కడా ఉండకూడదు.
తయారీ కేంద్రంలో వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలి.
నీరు, పొడి ఇసుకను నింపిన బకెట్లు సిద్ధంగా ఉంచాలి.
బయటి వ్యక్తులు అక్కడికి వెళ్లకుండా చూడాలి.
అత్యవసర సమయంలో అలారం మోగించేందుకు, అవసరమైతే లోపలి వారిని బయటకు తీసుకువచ్చేందుకు తగినంత సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి.
అగ్నిప్రమాద సమాచారాన్ని అత్యవసరంగా తెలియజేసేందుకు ఫోన్లు అందుబాటులో ఉంచాలి.
మండుతున్న బాణసంచాను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల ఉంచకూడదు.
ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అందులో మందులు సిద్ధంగా ఉంచాలి.
ఈ నిబంధనలను పాటించకుంటే లైసెన్సు రద్దు అవుతుంది.
ఎక్స్‌ప్లోజివ్ యాక్టు ప్రకారం బాణసంచా తయారు చేసే షెడ్లు, ప్లాట్‌ఫారం తగినంత దూరంలో ఉండాలి.
తయారీ కేంద్రాలపై నిఘా అవసరం
ప్రమాదాల నుంచి పాఠాలు నేర్వాలి
దీపావళి వేళ అప్రమత్తతే రక్ష
ప్రమాదాల్లో కొన్ని..
తేదీ ఊరు మృతులు
2012 డిసెంబర్ 30 వి.సావరం (రాయవరం) 3
2014 అక్టోబర్ 22 వాకతిప్ప(యు.కొత్తపల్లి) 18
2015 జూలై 22 పలివెల (కొత్తపేట మండలం) 5
2025 సెప్టెంబర్ 30 విలస (అయినవిల్లి మండలం) 2

ప్రాణ సంకటంగా బాణసంచా

ప్రాణ సంకటంగా బాణసంచా

ప్రాణ సంకటంగా బాణసంచా