
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
● ఒకరికి తీవ్ర గాయాలు
● మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన కారు
పెరవలి: విజయ దశమి రోజున జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. జాతీయ రహదారిపై పెరవలి మండలం నల్లాకులవారిపాలెం వద్ద మోటార్ సైకిల్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెరవలి ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గురువారం రాత్రి 9.20 గంటలకు నల్లాకులవారిపాలెం వద్ద రోడ్డు కట్టింగ్‌ను దాటే సమయంలో రావులపాలెం నుంచి తణుకు వైపు వస్తున్న ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మోటార్ సైకిల్‌పై ఉన్న ముగ్గురు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటంతో పాటు వారిపై నుంచి కారు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. ప్రమాదంలో ఇంజేటి ఇస్సాకు (49)పై కారు వెళ్లటంతో తీవ్ర గాయాలు అయి రక్తపు మడుగులో కొట్టుకుంటూ మృతి చెందాడు. కంతేటి పోసయ్య (29) కారు ఢీకొట్టిన వేగానికి గాలిలోకి ఎగిరి రోడ్డు మధ్యలో ఉండే డివైడర్‌పై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బాతు వెంకటేశ్వరరావు ప్రమాద సమయంలో గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడటంతో తీవ్రగాయాలై కొట్టుకుంటుండగా స్థానికులు 108లో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు అక్కడ నుంచి విజయవాడ, అక్కడ నుంచి గుంటూరు ఆసుపత్రికి తరలించారు.
వెనక్కి వెళ్లిపోదామనుకోగా...
పండగ రోజు కావటంతో స్నేహితులు ముగ్గురు కలసి ఖండవల్లి నుంచి తణుకు వెళ్లటానికి మోటార్ సైకిల్‌పై వస్తుండగా నల్లాకులవారిపాలెం వచ్చేటప్పటికి తిరిగి ఖండవల్లి వెళ్లిపోదామని ఉద్దేశంతో మోటార్ సైకిల్ టర్నింగ్ తిప్పటంతో అదే సమయంలో రావులపాలెం నుంచి తణుకు వస్తున్న కారు వేగంగా ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. దీనికితో కారు ఢీకొట్టిన వెంటనే అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కన్నీటి సంద్రమైన ఖండవల్లి
ప్రమాదం జరిగిందని తెలిసిన ఖండవల్లిలో మూడు కుంటుంబాలు కన్నీటి పర్యతం అయ్యాయి. పండగ రోజు ఎంతో ఆనందంగా గడిపిన ఈ ముగ్గురు స్నేహితులు రాత్రి అయ్యే సమయానికి మృతి చెందటంతో ఆ కుటుంబాలు కన్నీటిలో మునిగిపోయాయి. గ్రామస్తులు ప్రమాద స్థలానికి వెళ్లి అక్కడ కనిపించిన భయానక దృశ్యాలను చూచి కన్నీరు పెట్టుకున్నారు. మృతుడు పోసియ్య భార్య కనకదుర్గ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటేశ్వరావు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి