
న్యాయం చేయాలంటూ ధర్నా
గణేశ్ జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలం జి.రాగంపేటలోని బ్లూ ఓషన్ కంపెనీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిరసగా శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికురాలు లొల్ల దుర్గమ్మను గత నెల ఏడవ తేదీన ఫ్యాక్టరీకి చెందిన వాహనం ఢీ కొనడంతో రెండు కాళ్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఆమెకు చెందిన ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం చేయించి ఇంటికి పంపించి వేశారు. అయితే ఆమెకు ప్యాక్టరీ యాజమాన్యం ఆర్థిక సహాయం అందించకపోవడంతో పాటు ఆమె ఆరోగ్య పరిస్థితిపై శ్రద్ధ చూపలేదు. దాంతో ఆమె కుటుంబ సభ్యులు ధర్నా చేయడానికి నిర్ణయించారు. ఆమెకు జి. రాగంపేట సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు బుంగా శేఖర్‌బాబు, ప్రజలు మద్దతు ఇచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఫ్యాక్టరీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. భర్త పని చేయలేని పరిస్థితిలో ఉండటంతో ఫ్యాక్టరీలో ఆమె పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకొంటోందని చెప్పారు. దుర్గమ్మ మంచాన పడటంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతుందని తెలిపారు. దుర్గమ్మకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బంగారు కృష్ణ, గ్రామ నాయకులు కల్యాణ్, బాబీ, విజయ్‌లు ఆందోళన కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు.