
మున్సిపాలిటీ గ్రూపు నుంచి బయటకు..
సచివాలయ సెక్రటరీల నిరసన
అమలాపురం టౌన్: వలంటీర్ల మాదిరిగా తమను ఇంటింటికీ పంపించి పథకాలపై ప్రచారం చేయిస్తూనే, సర్వే చేయమని ఒత్తిడి తెస్తున్న పరిణామాలపై అమలాపురం మున్సిపాలిటీలోని 15 వార్డు సచివాలయాల సెక్రటరీలు అభ్యంతరం చెబుతున్నారు. ఈ సర్వేలను వ్యతిరేకిస్తూ మున్సిపాలిటీ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి సోమవారం వార్డు సెక్రటరీలు లెఫ్ట్ అవడం మొదలు పెట్టారు. మున్సిపాలిటీలోని 15 వార్డు సచివాలయాల్లో 139 మంది వివిధ విభాగాల సెక్రటరీలుగా పనిచేస్తున్నారు. ఇందులో సోమవారం రాత్రికి 80 మందికి పైగా సెక్రటరీలు గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యారు. మంగళవారం కూడా మరికొంత మంది సెక్రటరీలు బయటకు రానున్నారని ఓ వార్డు సచివాలయ సెక్రటరీ చెప్పారు. మున్సిపాలిటీ అఫీషియల్ వాట్సాప్ గ్రూపు ప్రతి మున్సిపాలిటీకి ఉంటుంది.
ఇందులో మున్సిపాలిటీకి చెందిన కమిషనర్‌తో పాటు అన్ని విభాగాల అధికారులు ఉంటారు. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి చేసే పనులను తమకు అప్పగించడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల పదో తేదీన విజయవాడలో చేపట్టనున్న రాష్ట్ర స్థాయి మార్చ్‌పాస్ట్‌కు మున్సిపాలిటీలోని సెక్రటరీలు వెళ్లి నిరసన తెలిపేందుకు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇంటింటికీ వెళ్లి పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రచారం, సర్వే భారాన్ని మోపడాన్ని వార్డు సచివాలయ సెక్రటరీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.