
ఎంపీ మిథున్‌రెడ్డికి ఘన స్వాగతం
● సెంట్రల్ జైలు వద్దకు భారీగా
చేరుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు
● ఎయిర్‌పోర్ట్ వరకూ భారీ బైక్ ర్యాలీ
సాక్షి, రాజమహేంద్రవరం: లిక్కర్ అక్రమ కేసులో అరెస్టయ్యి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పత్రాలను పరిశీలించిన జైలు అధికారులు మిథున్‌రెడ్డిని సాయంత్రం 5.55 గంటలకు విడుదల చేశారు. ఎంపీ విడుదల విషయాన్ని తెలుసుకున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. మిథున్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. దీంతో జైలు వద్ద కోలాహలం నెలకొంది. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో భారీ బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు. సెంట్రల్ జైలు నుంచి మధురపూడి ఎయిర్‌పోర్ట్ వరకూ ఈ ర్యాలీ సాగింది.
మిథున్‌రెడ్డికి స్వాగతం పలికిన వారిలో ఆయన తండ్రి, మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ మంత్రి, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయిల్, కొవ్వూరు, అనపర్తి కో ఆర్డినేటర్లు తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పార్టీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్ల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కోనసీమ, కాకినాడ జిల్లాల నేతలు పాల్గొన్నారు.
మిథున్‌రెడ్డి అరెస్టు పైశాచిక ఆనందం
ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టు కూటమి ప్రభుత్వ పైశాచిక ఆనందానికి నిదర్శనమన్నారు. అక్రమ అరెస్టులకు వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎవరూ భయపడరు. లిక్కర్ అక్రమ కేసులో కూటమి ప్రభుత్వం కేసులు పెట్టిన వారందరూ కడిగిన ముత్యాల్లా బయటకు వస్తారు.
– జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ
యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
చంద్రబాబు శాడిజం
మిథున్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం పెట్టినది మ్యానేజ్‌డ్ కేసు అనే విషయాన్ని మొదటి నుంచీ చెబుతున్నాం. బెయిల్ పత్రాలు వచ్చినా కావాలనే విడుదల ఆలస్యం చేశారు. ఇది చంద్రబాబు శాడిజానికి నిదర్శనం. చంద్రబాబు ఎప్పుడూ హింసించి ఆనందం పొందుతారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బాబు ఎవరు?
– విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్
ముమ్మాటికీ కక్ష సాధింపే
పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష సాధించేందుకే ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టు. ఆయన జైలు నుంచి బయటకు రావడంతో పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నారు. న్యాయం ఎప్పటికీ గెలుస్తుంది.
– డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి,
వైఎస్సార్ సీపీ అనపర్తి కో ఆర్డినేటర్

ఎంపీ మిథున్‌రెడ్డికి ఘన స్వాగతం

ఎంపీ మిథున్‌రెడ్డికి ఘన స్వాగతం

ఎంపీ మిథున్‌రెడ్డికి ఘన స్వాగతం