
ఆటాడుకుంటున్నారు
20 ఏళ్లుగా పని చేస్తున్నాను
నేను 20 సంవత్సరాలుగా అమలాపురం బాలయోగి స్టేడియంలో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాను. రూ.వెయ్యి జీతానికి ఉద్యోగంలో చేరాను. తరువాత రూ.3 వేలు, రూ.6,700, రూ.12 వేలకు జీతం పెంచారు. ఇప్పుడు రూ.15 వేలకు జీతం పెరిగింది. కానీ, 13 నెలలుగా ఆ జీతం ఇవ్వకపోగా తాజాగా దీనిని రూ.8 వేలకు కుదించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం.
– ఆకుల వీరబాబు
2017లో టాలీ ఆపరేటర్‌గా చేరా..
శాప్ అనుమతి, కలెక్టర్ ఆదేశాల మేరకు నేను 2017లో కాకినాడ డీఎస్‌ఏలో టాలీ ఆపరేటర్‌గా తాత్కాలిక ప్రాతిపదికన చేరాను. ఇప్పుడు శాప్ అనుమతి లేదని నా పేరు తీసేశారు. డీఎస్‌ఏ అధికారులు న్యాయం చేయాలి. – తేజ
రూ.15 వేల నుంచి రూ.6 వేలకు..
నేను 20 ఏళ్లుగా డీఎస్‌ఏలో స్వీపర్‌గా పని చేస్తున్నాను. ప్రస్తుతం నా జీతం రూ.15 వేలు. దానిని రూ.6 వేలకు కుదించారు. ఖర్చులు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో రూ.6 వేలతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి?
– గుబ్బల జ్యోతి
● డీఎస్‌ఏలో సిబ్బంది జీతాల కుదింపు
● సగానికి సగం కోత
● శాప్ బోర్డు మీటింగ్ సాకు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఏళ్ల తరబడి పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచుతారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) తీరే వేరు. ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తున్న చిరుద్యోగుల జీతాల్లో సగానికి సగం కోత పెట్టింది. వారి జీవితాలతో ఆటాడుకుంటోంది. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇస్తున్నదే చాలీచాలని జీతమైతే.. అందులోనూ కోత పెడితే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.
2003 నుంచి..
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్‌ఏ)లో 2003 నుంచి తాత్కాలిక ప్రాతిపదికన సుమారు 20 మంది చిరుద్యోగులు పని చేస్తున్నారు. వీరందరినీ అప్పట్లో జిల్లా కలెక్టర్, శాప్ అనుమతితోనే ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. వీరిలో కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఇళ్ల భీమేశ్వరరావు (బాస్కెట్‌బాల్ కోచ్), నల్లా కామేశ్వరరావు (గ్రౌండ్స్‌మన్), ఆకుల వీరబాబు (నైట్ వాచ్‌మన్), కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జి.జ్యోతి (స్వీపర్), కె.లోవ (స్వీపర్), జి.పుల్లారావు (నైట్ వాచ్‌మన్), ఎం.లక్ష్మీనారాయణ (టెన్నిస్‌బాల్ పిక్కర్), ఎస్.నారాయణరావు (బ్యాడ్మింటన్ కోచ్), అబ్దుల్ వదూద్ (సీని యర్ అసిస్టెంట్), ఎన్.సత్యకృష్ణ (డేటా ఎంట్రీ ఆపరేటర్), శ్రీను, ఎన్‌వీ సాగర్ (గ్రౌండ్స్‌మన్) తదితరులున్నారు.
13 నెలలుగా..
వీరిలో ఆఫీస్ సిబ్బందికి ప్రతి నెలా రూ.18 వేల నుంచి రూ.21 వేలు, మిగిలిన వారికి రూ.15 వేల చొప్పున జీతాలు ఇచ్చేవారు. అయితే గత 13 నెలలుగా వీరికి ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వడం లేదు. గత ఆగస్టులో జరిగిన శాప్ బోర్డు మీటింగ్‌లో ఆఫీస్ సిబ్బందికి రూ.15 వేలు, గ్రౌండ్స్‌మన్, వాచ్‌మన్ల్‌కు రూ.8,000, స్వీపర్లకు రూ.6,000 చొప్పున జీతాలు కుదించాలని నిర్ణయించారు. ఆ మేరకు ఆయా డీఎస్‌ఏలను ఆదేశించారు. దీంతో, ఈ చిరుద్యోగులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇరవయ్యేళ్లకు పైబడి పని చేస్తూంటే.. ఇప్పుడిలా అన్యాయం చేయడమేమిటంటూ జిల్లా క్రీడాభిృద్ధి అధికారుల (డీఎస్‌డీఓ) వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. అయితే, శాప్ నుంచి ఆదేశాలు వచ్చాయని, తామేమీ చేయలేమని వారు చెప్పారు. కాకినాడ డీఎస్‌ఏలో 2017లో టాలీ ఆపరేటర్‌ను నిమించాలని శాప్ ఆదేశించింది. ఆ మేరకు తేజ అనే వ్యక్తిని ఆ పోస్టులో నియమించారు. అయితే, ఇప్పుడు శాప్ అనుమతి లేకుండా నియమించారని పేర్కొంటూ మొత్తం అతడి పేరును తొలగించారు.
అసలుకే ఎసరు పెట్టేలా..
రెండు దశాబ్దాలకు పైగా సర్వీసు ఉన్న తమను ఆయా ఉద్యోగాల్లో పర్మినెంట్ చేసి, జీతాలు పెంచాల్సింది పోయి, సగానికి సగం కోత పెట్టడమేమిటని ఆ చిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికై నా పర్మినెంట్ అవుతుందన్న ఆశతో పని చేస్తూండగా అసలుకే ఎసరు పెట్టినట్టు శాప్ వ్యవహరిస్తోందని వాపోతున్నారు. ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు నానాటికీ పెరుగుతున్న తరుణంలో ఇప్పటికే చాలీచాలని జీతాలతో కుటుంబాలు భారంగా నెట్టుకొస్తున్నామని, తమకు అన్యాయం చేయవద్దని వేడుకుంటున్నారు. సోమవారం కాకినాడ వచ్చిన శాప్ డైరెక్టర్ల బృందం ఎదుట వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయితే, వారి జీతాలు తగ్గించిన విషయం తమకు తెలియదని శాప్ డైరెక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడం ఈ ఎపిసోడ్‌లో కొసమెరుపు. చివరకు సమస్య అర్థం చేసుకుని, ఆ చిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు.

ఆటాడుకుంటున్నారు

ఆటాడుకుంటున్నారు

ఆటాడుకుంటున్నారు