
ఘనంగా త్రికోటి మహా సరస్వతీ పూజ
కాకినాడ రూరల్: శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని శ్రీపీఠం విద్యార్థులతో కళకళలాడింది. జిల్లా నలుమూలల నుంచీ వేలాదిగా వచ్చిన విద్యార్థులతో పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి త్రికోటి మహా సరస్వతి పూజ చేయించారు. సరస్వతీ కటాక్షం కలగాలనే సంక్పలంతో కుంకుమ పూజ నిర్వహించారు. పూజ కోసం విద్యార్థులకు సరస్వతీదేవి ఫొటో, పెన్ను, కుంకుమను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి స్వామీజీ మాట్లాడుతూ, సంకల్పం గొప్పదైతే ఏదైనా సాధించవచ్చన్నారు. ఒక్కో వయసులో ఒక్కో సంకల్పం ఉంటుందని, విద్యార్థులకు విద్య మాత్రమే మహా సంకల్పమని చెప్పారు. విద్యతో కుటుంబ అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిలో భాగస్వాములవుతారని, మనను లీనం చేసుకుని చదువు యజ్ఞం కొనసాగించాలని ఆకాంక్షించారు. పూజ అనంతరం విద్యార్థులు సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న ఐశ్వర్యాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా మహాశక్తి యాగం వంద కోట్ల కుంకుమార్చనలు 8వ రోజుకు చేరుకున్న సందర్భంగా మేథా సూక్త, సరస్వతీ హోమం నిర్వహించారు. మంగళవారం నాటికి వంద కోట్లకు చేరువవుతామని, దసరా వరకు కుంకుమార్చనలు జరుగుతాయని స్వామీజీ తెలిపారు. ఆ రోజు మహా పూర్ణాహుతి ఉంటుందన్నారు.
సరస్వతీ పూజకు హాజరైన విద్యార్థులు

ఘనంగా త్రికోటి మహా సరస్వతీ పూజ