
పీజీఆర్‌ఎస్‌కు 365 అర్జీలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు 365 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్‌ఓ జె.వెంకటరావు, ట్రైనీ కలెక్టర్ మనీషా తదితరులు అర్జీలు స్వీకరించారు. వీటిపై సత్వరం సమగ్ర విచారాణ చేపట్టి, తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జీఎస్టీ తగ్గింపు లబ్ధిపై
అవగాహన కల్పించాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జీఎస్టీ తగ్గింపు వలన కలిగే లబ్ధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నా రు. ఈ అంశంపై డివిజన్ స్థాయి అధికారులతో కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా, ని యోజకవర్గ, మండల, వార్డు, సచివాలయ స్థా యిల్లో జీఎస్టీ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జీఎస్టీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. అక్టోబర్ 19 వరకూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ జె.వెంకటరావు, ట్రైనీ కలెక్టర్ మనీషా, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఐటీఐలో నాలుగో విడత
అడ్మిషన్ల కౌన్సెలింగ్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ ఐటీఐలో నాలుగో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ సోమవారం నిర్వహించారు. కాకినాడ, జగ్గంపేటల్లోని ప్రభుత్వ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో మిగిలిస 43 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ప్రైవేట్ ఐటీఐలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తామని అడ్మిషన్ల కన్వీనర్ జీవీకే వర్మ తెలిపారు.
లంకల్లో ప్రజలు
అప్రమత్తంగా ఉండాలి
అమలాపురం రూరల్: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతుండడంతో జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని, మంగళవారం రెండో ప్రమాద హెచ్చరికకు వరద నీరు చేరుకునే అవకాశం ఉందన్నారు. దీంతో గోదావరి తీరం వెంబడి తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తం కావాలని సూచించారు. ఇప్పటికే కొన్ని గ్రామాల కాజ్ వేలపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయని, బోట్ల సహకారంతో అత్యవసర పనులు ఉన్నవారిని మాత్రమే తరలించాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.