
క్రీడా అకాడమీలు పునఃప్రారంభిస్తాం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): వివిధ క్రీడా అకాడమీలను త్వరలో పునఃప్రారంభిస్తామని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) బోర్డు సభ్యుడు, అకాడమీస్ కమిటీ సభ్యుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎ.రమణారావు తెలిపారు. ఆయనతో పాటు శాప్ సభ్యులు ఎ.రమణారావు, పేరం రవీంద్రనాథ్, కె.జగదీశ్వరి, పీబీవీఎస్‌ఎన్ రాజు, శాప్ క్రీడాధికారి జూని గాలియోట్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్‌డీఓ) శ్రీనివాస్‌కుమార్‌తో కూడిన అకాడమీస్ కమిటీ సోమవారం కాకినాడలోని జిల్లా ప్రాధికార సంస్థ (డీఎస్‌ఏ) క్రీడా ప్రాంగణాన్ని సందర్శించింది. క్రీడా అకాడమీల ఏర్పాటుకు ఉన్న వసతులు, కావలసిన సౌకర్యాలపై అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా డీ ఎస్‌ఏ కార్యాలయంలో రమణారావు మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖపట్నం, కాకినాడ, నెల్లూ రు, తిరుపతి డీఎస్‌ఏలలోని అకాడమీలను నెల రోజుల్లోగా పునఃప్రారంభించే అంశంపై తమ కమిటీ శాప్ కు నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. వివిధ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మెరుగైన క్రీడా శిక్షణ ఇచ్చేందుకు 100 మంది కోచ్‌ల నియామకానికి శాప్ ప్రభుత్వ అనుమతి కోరిందన్నారు. 14 నుంచి 16 రకాల క్రీడాంశాల్లో సుమారు 100 మంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన అన్ని వసతులూ అకాడమీల్లో కల్పిస్తామని చెప్పారు.