
స్టెత్ డౌన్.. సమ్మె సైరన్
● ఉద్యమ పథంలో పీహెచ్‌సీ వైద్యులు
● నేటి నుంచి ఓపీ సేవల నిలిపివేత
● ప్రభుత్వం సమస్యలు
పరిష్కరించాలని డిమాండ్
● పేదల వైద్య సేవలకు ఆటంకం
కాకినాడ క్రైం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) వైద్యులు స్టెతస్కోప్ కాసేపు పక్కన పెట్టి సమ్మె బాట పట్టారు. తొలి దశలో సోమవారం నుంచి ఓపీ సేవలు నిలిపివేయనున్నారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరి వీడి న్యాయపరమైన తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పూర్తి స్థాయిలో విధుల బహిష్కరణకు సైతం వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. ప్రజల కోసం ఆలోచించి సమ్మె నిర్ణయాన్ని పలుమార్లు వాయిదా వేస్తూ వస్తే అది తమ చేతకానితనంగా ప్రభుత్వం పరిగణించిందని మండిపడుతున్నారు. పీహెచ్‌సీ వైద్యుల సమ్మె పరిష్కారం దిశగా ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే జిల్లాలోని పేదల వైద్య సేవలకు ఆటంకం కలగనుంది.
ఇవీ సమస్యలు
● సర్వీస్‌లో ఉన్న మెడికల్ ఆఫీసర్లకు గతంలో 30 శాతం క్లినికల్, 50 శాతం నాన్ క్లినికల్ రిజర్వేషన్ ఉండేది. ప్రభుత్వం జీఓ నంబర్ 85 ద్వారా ఈ కోటాను 15, 30 శాతానికి కుదించేసింది.
● ఈ ఏడాది జీఓ నంబర్ 99 ద్వారా ఆరు బ్రాంచిల నిబంధన తెర మీదికి తెచ్చారు. దీని ప్రకారం, 15 శాతానికి కుదించిన క్లినికల్ సీట్ల రిజర్వేషన్ రేడియాలజీ, మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, అనస్థీషియా బ్రాంచిలకు మాత్రమే వర్తింపజేసింది. ఈ అన్యాయాన్ని వైద్యులు ఏడాది కాలంగా ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు.
● ఎంబీబీఎస్ చదివి వైద్యాధికారిగా నియమితులైన వారు పీజీ చదువుకోవడానికి ప్రభుత్వం అనేక షరతులు పెట్టింది. రూ.50 లక్షల ష్యూరిటీ ఇవ్వాలని, కనీసం పదేళ్లు ప్రభుత్వ సర్వీసులో అదే హోదాలో పని చేస్తామంటూ బాండ్ రాయాలని చెబుతోంది. అదీ కాక మెడిసిన్ చదివిన ఒరిజినల్ సర్టిఫికెట్‌ను కూడా ప్రభుత్వం తన వద్ద హామీగా పెట్టుకుంటోంది. వైద్య వృత్తిలో ఎదుగుదల లేదంటే పీజీ చదవడం దేనికని పీహెచ్‌సీల వైద్యులు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలో చేరే ఉద్యోగికి కూడా ఇన్ని కఠిన షరతులు ఉండవని వాపోతున్నారు. ఈ నిబంధనలు సడలించాలని కోరుతున్నా ప్రభుత్వం మనసు కరగడం లేదు.
● డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పని చేస్తున్న ఎంతో మంది వైద్యాధికారులకు 20 ఏళ్లుగా పదోన్నతులు లేవు. వారికి పదోన్నతులిస్తామని ఎన్నికల వేళ అసోసియేషన్ నాయకులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఇప్పుడు ఆ విషయం ప్రస్తావిస్తే కక్షసాధింపు చర్యలకు పూనుకుంటోందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై గళమెత్తిన పలు జిల్లాల సంఘ నాయకులను ప్రభుత్వ పెద్దలు నేరుగా బెదిరించారని ఆరోపిస్తున్నారు.
● కోవిడ్ వేళ అత్యవసర పరిస్థితిలో చేరి, ప్రాణాలకు తెగించి మరీ రోగులకు వైద్య సేవలు అందించిన తమపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైద్యులు చెబుతున్నారు. 2020–22 మధ్య ఉద్యోగంలో చేరిన వైద్యులకు ఇప్పటికీ రూ.53,500 మాత్రమే జీతం ఇస్తున్నారు. 2023లో నియమితులైన ఫ్రెషర్లకు రూ.80 వేల నుంచి రూ.90 వేల పే స్కేల్ అమలు చేస్తున్నారు. ఇలా సీనియర్లు అన్యాయానికి గురవుతున్నారు. తమ జీతాలను తాజా పే స్కేల్‌తో సమానం చేసి, పెండింగ్ జీతాన్ని నోషనల్ ఇంక్రిమెంట్ల కింద చెల్లించాలని కోరుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
● గత ఏడాది ఇదే నెలలో వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తామని అప్పట్లో కూటమి నాయకులు, అధికారులు చెప్పారు. తీరా నిరసన విరమించాక ఏమాత్రం పట్టించుకోలేదు. నాటి అనుభవంతో రగిలిపోతున్న మెడికల్ ఆఫీసర్లు ఈసారి అటువంటి మోసాలకు గురి కాబోమని స్పష్టం చేస్తున్నారు.
● చంద్రన్న సంచార చికిత్స వాహనంలో తిరిగి సేవలందిస్తున్నందుకు ప్రతి నెలా అదనంగా రూ.5 వేలు చెల్లించాలని కోరుతున్నారు.
● గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్న వైద్యుల భత్యానికి 50 శాతం అదనంగా చెల్లించాల్సి ఉండగా దానినీ గాలికొదిలేశారు.
● నోషనల్ ఇంక్రిమెంట్ల కోసం ఫైల్ పెట్టినా ప్రభుత్వం తిరస్కరిస్తోంది. పైగా రిజెక్ట్ అయినట్లు చెబుతూ మభ్యపెడుతోంది.
● రాష్ట్రం విడిపోయి దశాబ్దం దాటినా ఇప్పటికీ స్థానికత వల్ల తలెత్తుతున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం వైద్యాధికారులకు శాపంగా మారింది.
దశల వారీ ఆందోళన
ఈ సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ పీహెచ్‌సీ వైద్యుల సంఘం (ఏపీపీహెచ్‌సీడీఏ) పిలుపు మేరకు వైద్యులు సమ్మె బాట పట్టారు. దీనిని దశల వారీగా నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రాజ్‌కుమార్, డాక్టర్ సందీప్ తెలిపారు. ఇందులో భాగంగా రెండు రోజులుగా నల్ల రిబ్బన్లతో వైద్యులు నిరసన తెలిపారు. అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలిగారు. సోమవారం నుంచి ఓపీ సేవలు బహిష్కరించనున్నారు. అత్యవసర సేవలు మాత్రమే అందిస్తారు. మంగళవారం జిల్లా కేంద్రాల్లో నిరసన తెలుపుతారు. వచ్చే నెల 1న ప్లకార్డులు చేబూని జిల్లా కేంద్రంలో ర్యాలీ, ధర్నా నిర్వహిస్తారు. 2న విజయవాడకు దీక్షా యాత్ర నిర్వహిస్తారు. 3న నిరాహార దీక్షలు చేపడతారు. ఇన్ సర్వీస్ పీజీ కోటా సహా తమ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్‌తో ఉద్యమించనున్నారు.
సార్ డెన్మార్క్ వెళ్తున్నారంటూ..
తమ సమస్యలు పరిష్కరించాలని పీహెచ్‌సీ వైద్యుల సంఘం నాయకులు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్, అంతకుముందు కృష్ణబాబు, కమిషనర్ వీరపాండియన్, హెల్త్ డైరెక్టర్ పద్మావతితో పాటు నేరుగా ముఖ్యమంత్రికి సైతం తమ ఆవేదన చెప్పుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేదు. తాజాగా సౌరవ్ గౌర్ డెన్మార్క్ వెళ్తున్నారని, నెల రోజుల వరకూ రారని, సమ్మె వాయిదా వేసుకోవాలని, సోమవారం నుంచి ఆయన స్థానంలో కృష్ణబాబు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారని, ఆయనకు ఎటువంటి అధికారాలూ ఉండవని ప్రభుత్వం చెబుతోంది. ఇదంతా తమను మరోసారి బురిడీ కొట్టించే వ్యూహమేనని పీహెచ్‌సీల వైద్యులు భావిస్తున్నారు.
అన్ని వర్గాల మద్దతు
వైద్యాధికారుల సమ్మెకు అన్ని వర్గాల మద్దతూ లభిస్తోంది. ఏపీ వైద్య విధాన పరిషత్ వైద్యులు, వైద్య సంఘాలతో పాటు నాన్ మెడికల్, పారా మెడికల్ సిబ్బంది సహకారం అందుతోంది. సమస్యలు పరిష్కరించే వరకూ వెనకడుగు వేయం. ప్రజారోగ్యం పట్ల మాకున్న శ్రద్ధ ప్రభుత్వానికి లేదు. తక్షణమే సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలు సహకరించాలి.
– డాక్టర్ సందీప్ పోల్సపల్లి, ఏపీపీహెచ్‌సీడీఏ జిల్లా సెక్రటరీ, పి.మల్లాపురం
పీహెచ్‌సీ వైద్యాధికారి
జిల్లాలో పీహెచ్‌సీల వివరాలు
మొత్తం పీహెచ్‌సీలు 37
రెగ్యులర్ వైద్యాధికారులు 104
పీహెచ్‌సీల్లో రోజువారీ ఓపీ సుమారు 2,500

స్టెత్ డౌన్.. సమ్మె సైరన్

స్టెత్ డౌన్.. సమ్మె సైరన్

స్టెత్ డౌన్.. సమ్మె సైరన్