
జగన్, చిరంజీవిలకు క్షమాపణ చెప్పాలి
● మాజీ మంత్రి కన్నబాబు డిమాండ్
● అసెంబ్లీలో బాలకృష్ణ, కామినేని వ్యాఖ్యలపై మండిపాటు
కాకినాడ రూరల్: సభా మర్యాద పాటించకుండా సభలో లేని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సినీ నటుడు చిరంజీవిలను కించపరిచేలా మాట్లాడిన బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్‌లు వెంటనే క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. కాకినాడ వైద్యనగర్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీలో చిరంజీవి, జగన్ గురించి మాట్లాడిన తరువాత బాలకృష్ణ మానసిక స్థితి ఎలా ఉందో తేటతెల్లమైందన్నారు. ‘కౌన్సిల్‌లో కుప్పం ఎమ్మెల్యే అంటే తప్పంట. కానీ మీరు మాత్రం సైకో అనవచ్చా?’ అని ప్రశ్నించారు. ‘జగన్‌పై విషం కక్కుతూ మానసికంగా కుంగదీయాలని మీరు చూసి నా ఆయన మాత్రం లెక్క చేయకుండా పెద్ద పార్టీని నడుపుతూ ముందుకు సాగుతున్నారు’ అని అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయలేదని నిలదీశారు. ఎఫ్‌డీసీ జాబితాలో బాలకృష్ణ పేరును 9వ స్థానంలో వారి ప్రభుత్వమే పెట్టిన సంగతి చూసుకోవాలని అన్నారు. బజారు భాష మాట్లాడవద్దని హితవు పలికారు. ఆన్‌లైన్‌లో తిట్టడం, ఆఫ్‌లైన్‌లో కాళ్లు పట్టుకోవడం పరిపాటైందని, పద్ధతి మార్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలో యూ రియా దొరక్క రైతులు అల్లాడుతున్నారని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, కేంద్రం నుంచి నిధులు రావడం లేదని, రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, కట్టక ముందే పోలవరం కొట్టుకుపోతోందని, ఇటువంటి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాల్సింది పోయి జగన్‌ను అవమానించడం, చిరంజీవిని అందులోకి లాక్కురావడం చేశారని దుయ్యబట్టారు.
నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు
డ్రైవింగ్ లైసెన్స్ మాదిరిగా బాలకృష్ణకు పిచ్చి సర్టిఫికెట్ ఉందని, దాంతో ఏదైనా మాట్లాడవచ్చనుకుంటూ కళ్లజోడు నెత్తికి పెట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని కన్నబాబు మండిపడ్డారు. ఎవడాడు అంటూ చిరంజీవిని, సైకో అంటూ మాజీ సీఎం జగన్‌ను పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడటం తప్పు కాదా అని ప్రశ్నించారు. కామినేని శ్రీనివాస్ భాష ఎలా ఉందో చూశామన్నారు. చిరంజీవిని లాక్కుని రావల్సిన పనేముందన్నారు. తమను జగన్‌మోహన్‌రెడ్డి అవమా నించలేదని చిరంజీవి చెప్పారన్నారు. ఇదే విషయాన్ని ఆర్.నారాయణమూర్తి కూడా ఉద్ఘాటించారన్నారు. చి రంజీవి లేఖతో నిజాలు నిలకడగా తెలుస్తాయనే రుజువైందని అన్నారు. 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని, చిరంజీవిని అవమానించారని ఇన్నాళ్లూ జగన్‌పై తప్పుడు ప్రచారం చేశారన్నారు. అసెంబ్లీలో కామినేని, బాలకృష్ణ మాటలకు క్షమాపణలు చెబుతారమో చూశామని, కానీ అలా చేయలేదని అన్నారు. డిప్యూటీ స్పీకర్‌ను కూడా కామినేని అవమానకరంగా మాట్లాడారన్నారు. రికార్డుల నుంచి తొలగిస్తామంటున్నారని, సోషల్ మీడియాలో రికార్డులను ఎవరు తొలగిస్తారని ప్రశ్నించారు. చిరంజీవి, జగన్‌కు అవమానం జరిపోయింది కదా! అని అన్నారు.
జగన్ శక్తిని తట్టుకోలేకే కూటమి కట్టారు
‘పేదల పక్షాన పని చేసిన జగన్ శక్తిని తట్టుకోలేకే మీరందరూ కూటమి కట్టారు. 40 శాతం ఓటు షేర్ ఉన్న నాయకుడిని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడతారా?’ అని కన్నబాబు ప్రశ్నించారు. కూటమిలోని మూడు పార్టీల్లో ఎవరి ఓటు షేర్ ఎంతో తేల్చి చెప్పాలన్నారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, వారిలో వారే కొట్టుకుని, వారిలో వారే తిట్టుకుని ప్రజల సమస్యలను వదిలేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్ వ్యక్తిగత అజెండా కొనసాగుతోందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కల్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్‌లను టార్గెట్ చేశారన్నారు. వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు వారైనా అర్థవంతమైన చర్చ జరపాలి కదా! అని అన్నారు. విలేకర్ల సమావేశంలో శ్రీకాకుళం జెడ్పీ చైర్‌పర్సన్ విజయ తదితరులు పాల్గొన్నారు.