
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
ఆలమూరు: మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం సాయంకాలం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఆలమూరు ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం 216 ఏ జాతీయ రహదారిపై జొన్నాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెలగల సుజాత (45) మృతి చెందారు. కడియం మండలంలోని పొట్టిలంకకు చెందిన సుజాత తన భర్త సూరిబాబుతో కలిసి బైక్‌పై కపిలేశ్వరపురం వెళుతున్నారు. స్థానిక ఏటిగట్టు రోడ్డుకు వచ్చేసరికి ఎదురుగా వెళుతున్న సైక్లిస్ట్‌ను తప్పించేందుకు సడన్ బ్రేక్ వేయగా వెనుక కూర్చున్న సుజాత రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి రాజోలు వెళుతున్న ఆర్‌టీసీ బస్సు ఆమె తలపై నుంచి వెళ్లిపోవడంతో సుజాత అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై నరేష్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డివైడర్ ఢీకొని..
మండలంలోని చొప్పెల్లలో శనివారం రాత్రి జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన పసుపులేటి వేణుగోపాలరావు (47) మృతి చెందారు. వివరాలలోకి వెళితే మోరంపూడికి చెందిన వేణుగోపాలరావు కొద్దికాలంగా పుణ్యక్షేత్రమైన వాడపల్లిలో రోజ్ మిల్క్ సెంటర్ ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్నారు. శనివారం రాత్రి ఇంటికి వెళుతుండగా స్థానిక ఇరిగేషన్ లాకుల వద్దకు వచ్చేసరికి తాను నడపుతున్న బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వేణుగోపాలరావును హైవే, పోలీసు సిబ్బంది అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు.