
నన్నయ వర్సిటీ కబడ్డీ జట్టు ఎంపిక
పెదపూడి: జి.మామిడాడ డి.ఎల్.రెడ్డి డిగ్రీ కళాశాలల్లో ఆదివారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ పురుషుల కబడ్డీ జట్టు ఎంపికలు నిర్వహించారు. పోటీల్లో 70 మంది క్రీడాకారులు పాల్గొనగా వారిలో 14 మందిని విశ్వవిద్యాలయం జట్టుగా ఎంపిక చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన రిజిస్ట్రార్ కె.వి.స్వామి మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభతో అంతర్ విశ్వవిద్యాలయాల కబడ్డీ పోటీల్లో ఆదికవి నన్నయ యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. తమ యూనివర్సిటీ పరిధిలో 395 గుర్తింపు పొందిన కళాశాలలు ఉన్నాయన్నారు. 2006లో ప్రారంభించిన యూనివర్సిటీ తక్కువ కాలంలోనే పెద్ద యూనివర్సిటీగా రూపాంతరం చెందిందన్నారు. అక్టోబర్ 4 నుంచి 7వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో రాణి చెన్నమ్మ యూనివర్సిటీలో జరగనున్న జాతీయ స్థాయి అంతర విశ్వవిద్యాలయాల పురుషుల కబడ్డీ జట్టు పోటీల్లో తమ యూనివర్సిటీ జట్టు పాల్గొంటుందన్నారు. జి.మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ– కరస్పాండెంట్ డీ.ఆర్.కె.రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ పురుషుల కబడ్డీ సెలెక్షన్స్ తమ కళాశాలలో నిర్వహించేందుకు అనుమతినిచ్చిన యూనివర్సిటీ వీసీ ప్రసన్నశ్రీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.

నన్నయ వర్సిటీ కబడ్డీ జట్టు ఎంపిక