
వాడపల్లి వెంకన్నకు దసరా శోభ
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కిక్కిరిసింది. శనివారం ఇసుక వేస్తే రాలనంత రీతిలో భక్తులు తరలిరాగా దాదాపు ఆ స్థాయిలో ఈ ఆదివారం భక్తజనంతో ఆ క్షేత్రం కిక్కిరిసింది. ‘ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం’ నానుడితో అశేష భక్తజనం తరలిరావడంతో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి శనివారం రాష్ట్ర నలుమూలల నుంచి అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా మిగిలిన ఆరు రోజులు కూడా అత్యధికంగా భక్తజనం తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం దసరా సెలవులు, ఆదివారం కావడంతో అత్యధికంగా భక్తులు తరలివచ్చారు. వారితో పాటు ఏడు వారాల నోము పూర్తి చేసుకున్న భక్తులు అష్టోత్తర పూజలు జరిపించుకున్నారు. కొందరు స్వామివారి కల్యాణం చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజు దేవస్థానానికి రూ.8,90,146 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు.
● అత్యధికంగా తరలివచ్చిన భక్తజనం
● ఒక్కరోజు రూ 8.90 లక్షల ఆదాయం