
నేతన్నలకు బకాయిల వెతలు
కపిలేశ్వరపురం: తమ శ్రమతో స్థాపించిన చేనేత సహకార సంఘం నిర్వహణకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు గుదిబండలా మారాయంటూ అంగర చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు పూనుకున్నారు. అంగరలోని శ్రీగణపతి చేనేత పారిశ్రామికుల సంఘం రెండు జాతీయ స్థాయి అవార్డులను సాఽధించింది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేతులు మీదుగా ప్రశంసా పత్రాలను అందుకుంది. అలాంటి సంఘానికి ప్రభుత్వం నుంచి రూ.3,85,18,292 బకాయిలు రావాల్సి ఉంది. అందులో రూ.1,00,11, 858 ఆప్కో సంస్థ చెల్లించాల్సి ఉంది. పాలకులు పట్టించుకోకపోవడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. గ్రామంలో ఆదివారం నిరసన ర్యాలీ చేశారు. చేనేత సహకార సంఘం ఎదుట సుమారు 100 మంది రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. నాయకులు మాట్లాడుతూ ఆప్కో ద్వారా బకాయిలను చెల్లించాలని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆప్కో బకాయిలకు తోడు మరిన్ని పథకాల ద్వారా రావాల్సిన బకాయిలు సైతం సంఘం నిర్వహణకు సమస్యగా మారాయన్నారు. తమ డిమాండ్‌ను పరిశీలించి పరిష్కరించే వరకూ ఆందోళనను కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. వారికి పలువురు ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.