
నేరం వారిది.. శిక్ష వీరికి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికార పార్టీ అండదండలుంటే చాలు తిమ్మిని బమ్మిని చేసేయవచ్చని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నట్టున్నారు. అక్రమాలకు పాల్పడినా ఇట్టే తప్పించేసుకుని, చిరుద్యోగులను బలి చేసేయవచ్చని అనుకుంటున్నారేమో! నేరం ఒకరిది.. శిక్ష మరొకరికి అన్న చందంగా.. యూరియా సరఫరాలో చేతివాటం చూపుతూ కింది స్థాయి సిబ్బందిని బలి చేస్తున్నారు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో తాజాగా ఇటువంటి ఉదంతం చోటు చేసుకుంది. ఇటీవల జిల్లాలో సంచలనం రేపిన చేబ్రోలు యూరియా బాగోతాన్ని తలదన్నే రీతిలో ఒమ్మంగి పీఏసీఎస్‌లో తెలుగు తమ్ముళ్లు యూరియా దోపిడీకి తెగబడ్డారు.
ఏం జరిగిందంటే..
ఒమ్మంగి సొసైటీకి రెండు విడతల్లో 90 టన్నుల యూరియా వచ్చింది. రెండో విడత వచ్చిన యూరియాలో ఆ సొసైటీకి చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నేత ప్రోద్బలంతో సుమారు 170 బస్తాలను ఆ పార్టీ సానుభూతిపరులకు దోచి పెట్టేశారు. ఎకరం ఉన్నా, ఐదెకరాలున్నా ఆధార్ కార్డు చూసి ఒకటి రెండు యూరియా బస్తాలు ఇవ్వడమే గగనమైన తరుణంలో.. అధికారం అండ, అడిగేవారెవరున్నారనే తెగింపుతో ఏకంగా 170 బస్తాల యూరియాను పక్కదారి పట్టించేశారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో వ్యవసాయ శాఖ కమిషనర్ దీనిపై విచారణకు ఆదేశించారు. ఆ మేరకు ఒమ్మంగి సొసైటీలో వ్యవసాయ అధికారులు విచారణ చేపట్టారు. మొత్తం నలుగురు అధిక మొత్తంలో యూరియా కొనుగోలు చేసినట్లు తేల్చారు. ఒకరు 50 బస్తాలు, మరో ముగ్గురు 40 బస్తాలు కలిపి మొత్తం 90 యూరియా బస్తాలు గద్దల్లా తన్నుకుపోయారని గుర్తించారు. పీఏసీఎస్ అటెండర్ రామకుర్తి వంశీ, సొసైటీ చిరుద్యోగి సుంకర గంగాధర రామారావుతో పాటు మరో ఇద్దరు బయటి వారు కలిసి మొత్తం 170 యూరియా బస్తాలు తీసుకు వెళ్లినట్టు అధికారులు తేల్చారు.
అసలైన పెద్దలను తప్పించి..
అయితే, యూరియాను పక్కదారి పట్టించినట్లు గుర్తించిన నలుగురిలో ఇద్దరు అదే సొసైటీలోని చిరుద్యోగులని చెప్పడం పలు సందేహాలకు తావిస్తోంది. విషయం బయట పడటంతో అధికార పార్టీ నేతలు ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి, ఈ సంఘటనను మసి పూసి మారేడు కాయ చందంగా చేసేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే కోటాకు మించి యూరియా బస్తాలను అడ్డగోలుగా తరలించుకుపోయిన అసలైన పెద్దలను తప్పించేసి, చిరుద్యోగులను బలి చేశారని ఒమ్మంగి రైతులు తూర్పార పడుతున్నారు. ఒమ్మంగి సొసైటీ, వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉన్న ఇద్దరు టీడీపీ కీలక నేతలు కనుసన్నల్లోనే ఆ పార్టీ సానుభూతిపరులకు యూరియా దోచి పెట్టారని పలువురు చెబుతున్నారు. ఆ ఇద్దరు కీలక నేతలే ఈ యూరియా బాగోతంలో అసలైన దొంగలను తప్పించి, అమాయకులైన చిరుద్యోగులను బలి పశువులను చేశారని అంటున్నారు. సంఘానికి ఒకేసారి యూరియా భారీగా వచ్చింది. ఈ నేపథ్యంలో దీని విక్రయాలు క్రమపద్ధతిలో జరపలేని గందరగోళంలో ఎవరెంత తీసుకువెళుతున్నారో తెలియలేదని మరో కట్టుకథ కూడా అల్లారంటున్నారు. ఇదే కారణంతో యూరియా నిల్వలను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేకపోయామంటూ వాస్తవాన్ని తొక్కిపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇతరుల పేరిట దోపిడీ!
మొత్తం 170 బస్తాల యూరియాను దారి మళ్లించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆ ఇద్దరు నేతలు ఇదే సొసైటీలో మరో పెద్ద కుంభకోణానికి కూడా పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలోని పలువురి ఆధార్ కార్డులు సేకరించి, వారి పేరున పెద్ద ఎత్తున యూరియా దోచేసినట్టు బయటపడింది. అధికారులు గుర్తించిన దాని కంటే రెండుమూడు రెట్లు అధికంగా యూరియాను తెలుగు తమ్ముళ్లు దారి మళ్లించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సొసైటీలో బస్తా రూ.266కు కొనుగోలు చేసి బ్లాక్‌లో రూ.350 నుంచి రూ.400కు అమ్మి వారు సొమ్ములు వెనకేసుకున్నారనే విషయం ఒమ్మంగిలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
‘తమ్ముళ్ల’ యూరియా దోపిడీ
ఒమ్మంగి సొసైటీలో
వెలుగు చూసిన బాగోతం
170 బస్తాలు పక్కదారి
ఇద్దరు నేతల క్రియాశీలక పాత్ర
చిరుద్యోగులను బలి చేసే యత్నం
ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తీరు
కూటమి సర్కారుకు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ప్రస్తుత ఖరీఫ్‌లో అదునుకు యూరియా లభించక రైతులు నానా అగచాట్లూ ఎదుర్కొంటున్నారు. ముందుగా కూపన్లు ఇచ్చినా.. ఎన్నెకరాల భూమి ఉన్నా ఒక బస్తా యూరియా దొరికితే గొప్పే అన్నట్టుగా ఉంది రైతుల పరిస్థితి. సరిగ్గా ఇదే తరుణంలో తెలుగు తమ్ముళ్లు యూరియా అమ్మకాలను గుప్పెట్లో పెట్టుకుని రైతులను దోచుకుంటున్నారనే విమర్శలు జిల్లావ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ సానుభూతిపరులకు బస్తాలకు బస్తాల యూరియాను గంపగుత్తగా తరలించేసి, సొమ్ము చేసుకున్న సంఘటనలు వివిధ మండలాల్లో ఇటీవల వెలుగు చూశాయి. దాదాపు అన్నిచోట్లా ‘తమ్ముళ్ల’ పెత్తనం మితిమీరి నడిచిందనే ఆరోపణలు వచ్చాయి. ప్రత్తిపాడు రూరల్, గండేపల్లి, జగ్గంపేట, గొల్లప్రోలు తదితర మండలాల్లో ఇందుకు బలం చేకూర్చే సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పీఏసీఎస్‌కు కోటా ప్రకారం వచ్చిన 20 టన్నుల యూరియా అమ్మకాలను టీడీపీ నేతలు తమ చేతుల్లోకి తీసుకున్నారు. సుమారు 100 బస్తాలు పార్టీ సానుభూతిపరులకు దోచిపెట్టడం, రైతుల చేతుల్లో కూపన్లను బలవంతంగా లాగేసుకోవడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. దీనిపై వైఎస్సార్ సీపీ గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల లోవరాజు ఆధ్వర్యాన రైతులు రోడ్డెక్కారు కూడా.

నేరం వారిది.. శిక్ష వీరికి..