
కనకదుర్గమ్మకు చీర, సారె
అన్నవరం: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారికి దసరా మహోత్సవాల సందర్భంగా రత్నగిరి సత్యదేవుని తరఫున అన్నవరం దేవస్థానం అధికారులు, పండితులు గురువారం చీర, సారె సమర్పించారు. సత్యదేవుని సోదరిగా కనకదుర్గమ్మకు ఏటా దసరా వేడుకల్లో చీర, సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులతో పాటు వేద పండితులు సూర్యనారాయణ, సంతోష్, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకుడు సుధీర్ తదితరులు పాల్గొన్నారు. వారికి విజయవాడ దేవస్థానం పండితులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేదపండితులు ఆశీస్సులు అందజేసి ప్రసాదాలు బహూకరించారు.