
సత్యదేవుని సన్నిధిలో రీల్స్ షూటింగ్
● పవిత్ర నక్షత్ర వనంలో నృత్యాలు
● మండిపడుతున్న భక్తులు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానాన్ని రెండు యువ జంటలు బుధవారం తమ రీల్స్ షూట్‌కు వేదికగా చేసుకున్నాయి. ఓవైపు దసరా నవరాత్రుల సందర్భంగా దేవస్థానంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఇలా సినిమా పాటలకు స్టెప్పు లేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టులు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం దేవస్థానంలోని సత్యగిరిపై ఘాట్ రోడ్, నక్షత్ర వనంలో నాగార్జున, దుర్గ, లోవరాజు లక్ష్మి సినిమా పాటలకు స్టెప్పులేశారు. తర్వాత ఆ రీల్స్‌ను సంక్రాంతి పేరుతో, డ్రైవర్ రాజు అనే పేరుతో ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దేవస్థానం 27 నక్షత్రాల పేరుతో పవిత్రమైన వృక్షాలను పెంచుతున్న నక్షత్ర వనం లోపలకు వెళ్లి మరీ స్టెప్పులేయడంపై భక్తులు మండిపడుతున్నారు. వందల సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నా వీరు దర్జాగా రీల్స్ షూట్ చేయడంతో అంతా అవాక్కయ్యారు. దేవస్థానంలో సెక్యూరిటీ వైఫల్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు జరగకుండా దేవస్థానం అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.