
ముగిసిన 11 జిల్లాల టీఓటీల శిక్షణ
సామర్లకోట: పేదరిక నిర్మూలనకు గ్రామ స్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అమలు చేయాలని సీనియర్ ఫ్యాక్టలీలు డి.శ్రీనివాసరావు, ఎస్‌ఎస్ శర్మ అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు వరకు ఉత్సాహవంతులైన పంచాయతీ కార్యదర్శులను టీఓటీలుగా ఎంపిక చేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై మూడు రోజుల పాటు నిర్వహించిన ఆరో బ్యాచ్ శిక్షణ బుధవారంతో ముగిసింది. మొత్తం 300 మంది టీఓటీలకు శిక్షణ ఇచ్చారు. గ్రామాల్లో ఆకలి బాధలను నిర్మూలించడం, ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాల పెంపు, అందరికీ తాగునీటి వసతి కల్పించడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, ఉపాధి–ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై శిక్షణ ఇచ్చినట్టు ఫ్యాకల్టీలు వివరించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలపై మండల పరిధిలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీలు జగన్నాథరావు, రామకృష్ణ, కె.శేషుబాబు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు.