
ఆరోగ్య భాగస్వామి.. ఫార్మాసిస్ట్
రాయవరం: రోగికీ, వైద్యునికీ మధ్య వారధిగా, ఆరోగ్య పరిరక్షణలో భాగస్వామిగా ఫార్మాసిస్టులు కీలకపాత్ర పోషిస్తున్నారు. పూర్వం ఫిజీషియన్ స్వయంగా ఔషధాలను తయారు చేసేవారు. కాలక్రమంలో ఔషధ ఉత్పత్తి రంగం ప్రత్యేకంగా అభివృద్ధి చెందింది. నిపుణులైన ఔషధ ప్రయోక్తలే ఫార్మసిస్ట్లుగా అవతరించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆరోగ్య రక్షణ నిపుణుల సమూహంగా ఫార్మసిస్టులు ఉన్నారు. కమ్యూనిటీ ఫార్మసీ, హాస్పిటల్ ఫార్మసీ, ఫార్మసీ పరిశ్రమ, ఔషధ నియంత్రణ, పరిశోధన–అభివృద్ధి, బోధన వంటి పలు రంగాల్లో తమ సేవలు అందిస్తున్నారు.
ఫార్మాసిస్ట్ డే ప్రాముఖ్యమిదీ..
1912 సెప్టెంబర్ 25న నెదర్లాండ్‌లోని హేగ్ నగరంలో ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్(ఐపీఎఫ్) ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఇదే తేదీన ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవాన్ని నిర్వహిస్తునారు. ఈ ఏడాది థింక్ హెల్త్.. థింక్ ఫార్మాసిస్ట్ అనే నినాదంతో ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
పేషెంట్‌కు చేరే వరకు..
కాలానుగుణంగా ప్రపంచంలో మందుల తయారీ అతి పెద్ద రంగంగా అవతరించింది. కొత్త రకం వైరస్‌లు అవతరిస్తూ.. కొత్త రోగాలు వస్తున్నాయి. వీటిని తట్టుకునేందుకు మందుల తయారీ సవాలుగా మారింది. ఎలాంటి రోగానికై నా మందును కనుగొనే ఫార్ములానైనా ఫార్మాసిస్ట్లు తమ భుజాలపై వేసుకుని, ప్రపంచ జనాభాకు అనుగుణంగా, వివిధ ప్రాంతాల ప్రజల జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని మందులు తయారు చేస్తున్నారు. మందుల తయారీ నుంచి పేషెంట్‌కు చేరే వరకు అన్ని విషయాల్లో ఫార్మాసిస్ట్‌లదే కీలక పాత్ర.
ఫార్మసీ కోర్సులు చదివితే..
ఇంటర్ బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు మార్కుల ఆధారంగా ఫార్మసీ సీట్లు కేటాయిస్తారు. డిప్లొమా ఇన్ ఫార్మసీ చదివితే మెడికల్ షాపు పెట్టుకోవడానికి అర్హత వస్తుంది. ఆపై బీఫార్మసీ చేసిన వారు ల్యాబ్స్‌లో ఔషధాలకు సంబంధించి పని చేస్తారు. ఎం.ఫార్మసీ చేసిన వారు ఔషధ తయారీ సంస్థల్లో నూతన ఔషధాలు, కాంబినేషన్లు కనిపెట్టడం, పరిశోధించడం, క్వాలిటీ కంట్రోల్ వంటి విభాగాల్లో ఉంటారు. అలాగే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ కోర్సులను కూడా చేయవచ్చు.
కోనసీమలో పరిస్థితి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో డైరెక్టర్ సెకండరీ హెల్త్ పరిధిలో ఇద్దరు చీఫ్ ఫార్మసీ ఆఫీసర్లు, తొమ్మిది మంది సీనియర్ ఫార్మసీ ఆఫీసర్లు, 16 మంది ఫార్మసీ ఆఫీసర్లు ఉన్నారు. అలాగే జిల్లాలో మూడు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులుండగా, ప్రతి ఏరియా ఆస్పత్రిలో చీఫ్ ఫార్మసీ ఆఫీసర్, సీనియర్ ఫార్మసీ ఆఫీసర్, నలుగురు ఫార్మసీ పోస్టులు ఉంటాయి. తొమ్మిది సీహెచ్‌సీలుండగా, ప్రతి సీహెచ్‌సీలో సీనియర్ ఫార్మసీ, ఫార్మసీ ఆఫీసర్ ఉంటారు. అదేవిధంగా 46 పీహెచ్‌సీలు, ఏడు అర్బన్ హెల్త్ సెంటర్లలో ఫార్మాసిస్ట్‌లు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఫార్మాసిస్ట్ గ్రేడ్–2 ఫార్మసీ ఆఫీసర్‌గా మార్పు చేశారు.
వైద్యులతో సమానంగా సేవలు
ఫార్మాసిస్టులకు మాత్రమే వైద్యులతో సమానంగా సేవలందించే అవకాశం ఉంటుంది. కరోనా విజృంభించిన సమయంలో నిరంతర సేవలు అందించాం. కరోనా బారిన పడినా, తిరిగి విధుల్లో చేరి పేషెంట్లకు అవసరమైన మందులు ఆందిస్తూ, వారు కోలుకునేందుకు చేసిన సేవలు వృత్తిపరంగా సంతృప్తినిచ్చాయి.
– ఎన్ వసంతరావు, ఫార్మాసిస్ట్, ఏరియా ఆస్పత్రి, అమలాపురం
పూర్తి బాధ్యత ఫార్మాసిస్ట్‌దే..
మందులు పేషెంట్‌కు చేరే వరకు పూర్తి బాధ్యత ఫార్మాసిస్టుల దే. మందుల స్టోరేజీ, బ్యాచ్ నంబర్, కాలం చెల్లే తేదీ, క్వాలిటీ వంటి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పేషెంట్‌కు ప్రమాదం. గత 12 ఏళ్లుగా ఉద్యోగం చేసిన అన్ని ప్రాంతాల్లో సంతప్తికరమైన సేవలు అందించాను.
– సీహెచ్ పేరిందేవితాయారు, ఫార్మాసిస్ట్, పీహెచ్‌సీ, రాయవరం
తయారీ నుంచి మందులు పేషెంట్‌కు
చేరే వరకు పూర్తి బాధ్యత
కొత్తగా వచ్చే వ్యాధులను
అడ్డుకోవడంలో కీలకపాత్ర
25న ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవం

ఆరోగ్య భాగస్వామి.. ఫార్మాసిస్ట్

ఆరోగ్య భాగస్వామి.. ఫార్మాసిస్ట్