
జయలక్ష్మి సొసైటీకి కొత్త బోర్డు ఏర్పాటు చేయాలి
అమలాపురం టౌన్: అనేక మంది విశ్రాంత ఉద్యోగులు జయలక్ష్మి కో–ఆపరేటివ్ సొసైటీ మోసాలకు బలవ్వగా, నేటికీ న్యాయం జరగలేదని కోనసీమ ప్రాంతానికి చెందిన ఆ సొసైటీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలోని ఏఎస్‌ఎన్ కళాశాలలో విశ్రాంత తహసీల్దార్ భాస్కర వెంకటేశ్వర్లు అధ్యక్షతన బుధవారం జయలక్ష్మి సొసైటీ బాధితుల సమావేశం జరిగింది. ప్రస్తుత సొసైటీ బోర్డు పూర్తి రాజీనామా చేసి, దాని స్థానంలో కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది రాజమహేంద్రవరం సీఐడీ కోర్టులో జయలక్ష్మికి చెందిన నలుగురు మేనేజర్లపై అవినీతి కేసులు నమోదైనా, ప్రస్తుత బోర్డు వారిపై ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది. మొత్తం 2,450 మంది ఈ సొసైటీలో రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించలేదని పేర్కొంది. ఇందులో కేవలం 13 మంది మాత్రమే ట్రిబ్యునల్‌లో కేసులు పెట్టారని గుర్తు చేసింది. రుణాలు తిరిగి చెల్లించని వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల నుంచి ఏ విధమైన ఆదాయం రాకుండా, వాటికి తాళాలు వేసి అలాగే వదిలేశారని విజయవాడకు చెందిన టీవీడీఎన్ ప్రసాదరావు తెలిపారు. అన్నింటా విఫలమైన ప్రస్తుత బోర్డు సభ్యులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురానికి చెందిన విశ్రాంత అధ్యాపకుడు భాస్కర్ మీనన్ మాట్లాడుతూ, అమలాపురం సొసైటీ బ్రాంచి నుంచి రుణాలు తీసుకున్న వారంతా తిరిగి చెల్లించినా, మిగిలిన బ్రాంచీల్లో రుణాలు తీసుకున్న వ్యక్తులు ఎగ్గొట్టడం వల్లే ఇక్కడి సభ్యులైన బాధితులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ బాధితులు, విశ్రాంత ఉద్యోగుల గుళ్లపల్లి వెంకట్రామ్, వేదనభట్ల కళా పూర్ణారావు, జి.కృష్ణారావు, తురగా చిన్న, ఇళ్ల నరసింహారావు, పుత్సా కృష్ణ కామేశ్వర్, రెహమాన్, రాజ్‌కుమార్, మావుళ్లయ్య, అర్జునుడు, నాగ అన్నపూర్ణ తదితరులు మాట్లాడారు.
కాకినాడలో 5న డైరెక్టర్ పదవులకు ఎన్నిక
కాకినాడ రూరల్: స్థానిక ది జయలక్ష్మి కోఆపరేటివ్ మాక్ సొసైటీలో ఖాళీ అయిన రెండు డైరెక్టర్ పదవులకు అక్టోబర్ 5వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నట్టు ఎన్నికల ఆఫీసర్ కంబాల శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం 5వ తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాకినాడ పేర్రాజుపేట, మున్సిపల్ గరల్స్ హైస్కూల్‌లో ఎన్నిక నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ రెండు డైరెక్టర్ పదవులకు ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటల నుంచి స్థానిక సర్పవరం జంక్షన్‌లోని సొసైటీ హెడ్ ఆఫీస్‌లో నామినేషన్లు తీసుకోవాలని ఎన్నికల అధికారి తెలిపారు.
బాధితుల సమావేశం డిమాండ్