
ప్రాణం మీదకు తెచ్చిన ప్రచార పిచ్చి
● ఎమ్మెల్యే ఫ్లెక్సీ పడి మహిళకు తీవ్ర గాయాలు
● పరిస్థితి ఆందోళకరం
అనపర్తి: అధికార పార్టీ ప్రచార పిచ్చి ప్రయాణికులకు ప్రాణాంతకంగా మారింది. అనుమతులు లేకుండా ఊరంతా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ప్రయాణికుల పాలిట శాపంగా మారుతున్నాయి. బిక్కవోలు గ్రామానికి చెందిన గువ్వల విజయలక్ష్మి, వెంకటరెడ్డి దంపతులు బుధవారం మోటార్ సైకిల్‌పై అనపర్తిలోని కంటి ఆసుపత్రికి వెళుతున్నారు. అనపర్తి పోలీస్ స్టేషన్ సమీపంలో చిన్న వంతెన వద్ద స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరిట ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ ఆకస్మికంగా ఆ దంపతులపై కూలింది. దీంతో వారు కింద పడిపోగా, ఫ్లెక్సీ ఫ్రేమ్ ఊచలు విజయలక్ష్మి తలకు నాలుగు అంగుళాల మేర చీరుకుని తీవ్ర గాయమైంది. తీవ్ర రక్తస్రావం అవుతున్న ఆమెను స్థానిక కానిస్టేబుల్ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆమె భర్త హెల్మెట్ ధరించి ఉండడంతో స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన ఫ్లెక్సీని కర్రలకు కట్టకుండా జార వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. బాధితురాలిని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి వస్తుందని, ఇందుకు కారణమైన ఎమ్మెల్యేపై కేసు పెట్టాల్సి వస్తుందని ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఇంత జరిగినా టీడీపీ నాయకులు ఆ ఫ్లెక్సీని మళ్లీ అలాగే జారేయడం గమనార్హం.