
ఓడలరేవు తీరంలో బోటు దగ్ధం
రూ.పది లక్షలకు పైగా నష్టం
అల్లవరం: ఓడలరేవు వైనతేయ నదీ తీరం జెట్టీ వద్ద మరమ్మతులు నిర్వహిస్తున్న బోటు మంగళవారం అర్ధరాత్రి దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.10 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. మండలంలోని కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన కొపనాతి శంకరానికి చెందిన బోటుకు రెండు నెలలుగా మరమ్మతులు చేస్తున్నారు. రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తయి.. చేపల వేటకు సిద్ధమవుతున్న తరుణంలో మత్స్యకార బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. కాలిపోతున్న బోటుని కాపాడేందుకు స్థానికులు ఓడలరేవు ఓఎన్‌జీసీకి చెందిన ఫైరింజిన్ విభాగానికి సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయం అంతు చిక్కడం లేదు. అర్ధరాత్రి బోటు అగ్ని ప్రమాదానికి గురికావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే బోటు యజమానికి చెందిన మరో బోటు వైనతేయ నదిలో లంగరు వేసి ఉన్న సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. బోటుకు ఎవరైనా నిప్పు పెట్టారా లేక యాదృచ్చికంగా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై బోటు యజమాని శంకరం అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఓడలరేవు తీరంలో బోటు దగ్ధం