
కుప్పకూలిన పవన్ భారీ కటౌట్
జన సంచారం లేకపోవడంతో
తప్పిన ముప్పు
కాకినాడ క్రైం: డిప్యూటీ సీఎం కొణిదెల పవన్‌కల్యాణ్ అభిమానుల అత్యుత్సాహం ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. భారీ కటౌట్ కుప్పకూలగా.. అక్కడ జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. గురువారం ‘ఒజి’ చిత్రం విడుదల సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, మరో జనసేన నేత నున్న దొరబాబు పేర్లతో నిత్యం రద్దీగా ఉండే భానుగుడి జంక్షన్‌లో 70 అడుగుల భారీ పవన్‌కల్యాణ్ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం ఈ కటౌట్ కుప్పకూలింది. భారీ ఎత్తులో ఏర్పాటు చేయడం వల్ల బరువు తాళలేక ఆ కటౌట్‌ను నిలిపిన కర్రలు తునాతునకలయ్యాయి. కటౌట్ రోడ్డుపై కూలగా.. ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు కటౌట్‌ను రోడ్డు మధ్య నుంచి అతికష్టంగా పక్కకు నెట్టారు. ఈ ఘటనతో ప్రయాణికుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. బాధ్యతాయుత స్థానంలో ఉన్న పార్టీ లీడర్లు ప్రచార ఆర్భాటానికి దూరంగా ఉంటూ, ప్రజల సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలని పలువురు అభిప్రాయపడ్డారు.