త్వరలోనే అగ్రిమెంట్
అన్నవరం దేవస్థానంలో శానిటేషన్ నిర్వహణ టెండర్‌ను పద్మావతి సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థతో వెంటనే అగ్రిమెంట్ కుదుర్చుకుని, అక్టోబర్ 1 నుంచి కాంట్రాక్ట్ అప్పగించాలని దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. అగ్రిమెంట్ అయ్యాక కానీ నెలకు ఎంత ఖర్చవుతుందో తెలియదు. ఈసారి శానిటేషన్‌తో పాటు హౌస్ కీపింగ్, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ, ప్లంబింగ్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్, వాషింగ్ తదితర పనులు కూడా ఆ కాంట్రాక్టర్ నిర్వహించాల్సి ఉంటుంది. అందువలన ఖర్చు కొంత పెరిగే అవకాశం ఉంటుంది.
– వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం
అన్నవరం: దసరా పండగ అందరికీ శుభాలను చేకూరుస్తుంది. కానీ, అన్నవరం దేవస్థానంపై మాత్రం ఈ పండగ వేళ భారీ ఆర్థిక భారం పడుతోంది. విజయ దశమి పర్వదినానికి ఒక రోజు ముందు.. అంటే అక్టోబర్ ఒకటో తేదీ నుంచే దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్ట్‌ను తిరుపతికి చెందిన పద్మావతి హాస్పిటాలిటీ, ఫెసిలిటీస్ మేనేజ్‌మెంట్ సంస్థ చేపట్టనుంది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో పారిశుధ్య నిర్వహణకు ఒకే యూనిట్‌గా పిలిచిన టెండర్‌ను ఆ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ ఆయా దేవస్థానాల్లో పారిశుధ్య నిర్వహణ, సత్రాల్లో హౌస్ కీపింగ్, రోడ్లు, టాయిలెట్ల క్లీనింగ్, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాలు నిర్వహణ తదితర పనులను రెండేళ్ల పాటు నిర్వహించాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14న జీఓ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థతో త్వరగా అగ్రిమెంట్ కుదుర్చుకుని, అక్టోబర్ 1 నుంచి శానిటేషన్ బాధ్యతలు అప్పగించాలని దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఏడు దేవస్థానాల ఈఓలను ఆదేశించారు.
వార్షికాదాయంలో 6 శాతం ఈ పద్దుకే..
‘పద్మావతి’ సంస్థతో కాంట్రాక్టు రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది. దీనిలోని షరతుల ప్రకారం ప్రతి నెలా దేవస్థానం ఆ సంస్థకు రూ.80 లక్షలు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా రెండేళ్లకు కలిపి సుమారు రూ.20 కోట్లు చెల్లించాలి. దేవస్థానం వార్షికాదాయం రూ.170 కోట్లు కాగా, ఇందులో సుమారు 6 శాతం ఈ పద్దుకే చెల్లించాల్సి ఉంటుంది. దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణకు ఇప్పటి వరకూ నెలకు రూ.67 లక్షల వరకూ మాత్రమే ఖర్చు చేస్తున్నారు. కొత్త కాంట్రాక్ట్ ప్రకారం ప్రతి నెలా రూ.15 లక్షలకు పైగా అదనపు భారం పడనుంది. అంటే ఏడాదికి రూ.1.8 కోట్లు, రెండేళ్లకు రూ.3.6 కోట్ల మేర భారం పడుతుంది.
వ్యూహాత్మకంగా..
ఆయా దేవస్థానాల్లో 2014కు ముందు పారిశుధ్య టెండర్లను విడివిడిగా పిలిచేవారు. స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయగా.. అతి తక్కువకు కోట్ చేసిన వారు ఆ కాంట్రాక్ట్ దక్కించుకునేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలకు కలిపి ఒకే టెండర్ పిలిచి ‘పద్మావతి’ సంస్థకే ఆ టెండర్ దక్కేలా వ్యూహాత్మకంగా వ్యవహారం పూర్తి చేశారనే విమర్శలు వచ్చాయి. ఆ సంస్థ యజమాని భాస్కరనాయుడు టీడీపీ పెద్దలకు సన్నిహితుడు కావడంతో అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తరువాత 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో ఏడు దేవస్థానాలకు విడివిడిగా పారిశుధ్య టెండర్లు పిలిచారు. దీంతో, ఇతర కాంట్రాక్టర్లు ఆయా టెండర్లు దక్కించుకున్నారు.
గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏడు దేవస్థానాల్లో పారిశుధ్య కాంట్రాక్టుకు ఒకే యూనిట్‌గా టెండర్ పిలవాలని గత ఏడాది ఆగస్టులో కూటమి సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు గత ఏప్రిల్‌లో తొలిసారి టెండర్ పిలిచారు. దీనికి 12 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. సాంకేతిక కారణాలతో ఆ టెండర్లను రద్దు చేసి, గత జూన్ 12న తిరిగి టెండర్లు ఆహ్వానించారు. దీంతో ‘విషయం’ అర్థం చేసుకున్న కాంట్రాక్టర్లు ఈసారి టెండర్లు వేయలేదు. పద్మావతి సంస్థతో పాటు విజయవాడకు చెందిన చైతన్యజ్యోతి సంస్థ మాత్రమే టెండర్ దాఖలు చేసింది. గత ఆగస్టులో టెక్నికల్ బిడ్ తెరవగా చైతన్యజ్యోతి సంస్థ డిస్‌క్వాలిఫై కాగా, పద్మావతి సంస్థ మాత్రమే అన్ని సాంకేతిక అర్హతలూ కలిగిఉన్న ఏకై క సంస్థగా నిలిచింది. ఈ మేరకు ఆ సంస్థను ఎంపిక చేసినట్లు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాడ్రేవు వినయ్‌చంద్ పేర్కొన్నారు. ఆ మేరకు జీఓ విడుదల చేశారు.
పాత కాంట్రాక్ట్ రూ.49 లక్షలే..
అన్నవరం దేవస్థానంలో 2022–24 మధ్య పారిశుధ్య కాంట్రాక్టును కేఎల్‌టీసీ సంస్థ నిర్వహించింది. ఆ సంస్థకు నెలకు రూ.49 లక్షలు చెల్లించేవారు. గడువు ముగియడంతో ఆ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో వైదొలగింది. అనంతరం, కనకదుర్గా ఏజెన్సీకి తాత్కాలికంగా పారిశుధ్య నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. శానిటేషన్ ఉద్యోగుల జీతాలు పెరగడంతో ఆ బిల్లు 365 మంది సిబ్బందికి నెలకు రూ.55 లక్షలకు పెరిగింది. దేవస్థానం శానిటేషన్ మెటీరియల్‌కు రూ.12 లక్షలు ఖర్చు చేస్తోంది. ఈవిధంగా ప్రతి నెలా పారిశుధ్య నిర్వహణకు రూ.67 లక్షలు వెచ్చిస్తున్నారు.
కొత్త కాంట్రాక్టులో పొందుపరచిన నిబంధనల ప్రకారం ‘పద్మావతి’ సంస్థకు ప్రతి నెలా రూ.80 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఫినాయిల్, బ్లీచింగ్ తదితర శానిటేషన్ మెటీరియల్‌కు రూ.7.50 లక్షలు, యంత్రాల నిర్వహణకు రూ.3.68 లక్షలు, సుమారు 365 మంది సిబ్బందికి కార్మిక చట్టం ప్రకారం వేతనాలుగా రూ.65 లక్షలు చెల్లించాలి. ఈ మొత్తం మీద కాంట్రాక్టర్‌కు 4.95 శాతం సర్వీస్ ట్యాక్స్ కూడా చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఫ అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్టు ‘పద్మావతి’కే..
ఫ ప్రతి నెలా రూ.80 లక్షల పైనే వ్యయం!
ఫ అక్టోబర్ 1 నుంచి కాంట్రాక్ట్
అమలులోకి వచ్చేలా అగ్రిమెంట్
చేసుకోవాలని కమిషనర్ ఆదేశం
ఫ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో
కూడా ఆ సంస్థకే కాంట్రాక్టు
సత్యదేవునిపై అదనపు భారం