
అప్రమత్తతతోనే భద్రత
● తల్లిదండ్రులూ..పిల్లలపై ఓ కన్నేయండి
● సెలవుల్లో వెన్నాడే ప్రమాదాలు
రాయవరం: పాఠశాలలకు దసరా సెలవులు ఇచ్చేశారు. పిల్లలు పట్టలేని ఆనందంతో ఉన్నారు. సెలవుల సమయంలో ఆటపాటల్లో మునిగి తేలుతుంటారు. ఈ సమయంలో ఒక్కోసారి ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. పాఠశాలల్లో నిత్యం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉండే విద్యార్థులు సెలవుల్లో తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటారు. అయితే ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చేస్తున్నారనే విషయాన్ని గమనిస్తుండాలి. కాలువల్లో స్నానాలకు వెళ్లే వారు కొందరైతే మరికొందరు సెల్‌ఫోన్లలో గేమ్స్‌ను చూస్తుంటారు. మరికొందరు సాహసాలు చేస్తుంటారు.
ఈత సరదా తీస్తుంది ప్రాణం
జిల్లాలో గోదావరి తీరం ఒక పక్క, మరో పక్క కాలువలు అధికంగా ఉంటాయి. సెలవుల్లో సరదా కోసం, కాలక్షేపం కోసం కొందరు ఈతకు దిగుతుంటారు. ఆ సమయంలో కాలక్షేపం కోసం వారు చేసే పనులు ఒక్కోసారి ఊహించని ప్రమాదాలకు దారితీస్తుంటాయి. దసరా, సంక్రాంతి సెలవుల్లో పిల్లలకు అధిక సమయం దొరుకుతుంది. ఆ సమయంలోనే వారు ప్రమాదాలకు గురవుతుంటారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పిల్లల సంరక్షణపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నదులు, కాలువలు, చెరువుల్లో నీరు నిండుగా ఉంది. సాధారణంగా నీరు కనిపిస్తే పిల్లలకు ఈత కొట్టాలనిపిస్తుంది. గ్రామీణ ప్రాంత పిల్లలకు ఎక్కువగా ఈత వస్తుంది. చిన్నప్పటి నుంచి పట్టణాలు, హాస్టళ్లలో ఉండే పిల్లలకు ఈత పెద్దగా తెలియదు. అటువంటి వారు గ్రామాలకు వచ్చి తోటి పిల్లలతో సరదాగా ఈతకు వెళ్తుంటారు. ఆ సమయంలో ఈత రాక ప్రమాదాలకు గురవుతుంటారు. అటు వంటి వారి విషయంలో తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలి. చెరువులు, కాలువల వైపుగా వెళ్లి నప్పుడు.. పెద్దవారిని తోడుగా తీసుకొని వెళ్లాలని వివరించాలి.
మితి మీరిన వేగంతో ప్రమాదం
కొందరు పిల్లలు తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంట్లో ఉన్న వాహనాలను తీసుకొని రోడ్లపైకి వచ్చేస్తుంటారు. మితిమీరిన వేగానికి తోడు రహదారి భద్రతా చర్యలు పాటించడం లేదు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాలు జరిగి.. ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి. పిల్లలకు మోటార్ సైకిల్ ఇస్తే తల్లిదండ్రులకు కూడా శిక్షలు పడతాయన్న విషయాన్ని విస్మరించకూడదు. చిన్నారుల చేతికి వాహనాలు ఇవ్వకపోవడమే శ్రేయస్కరం.
ఆన్‌లైన్ గేమ్స్‌తో జాగ్రత్తగా ఉండాలి
ఆన్‌లైన్ తరగతులు, అదనపు పరిజ్ఞానం కోసం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సెల్ ఫోన్స్ ఇస్తుంటారు. ఇటువంటి సందర్భాల్లో ప్రయోజనం ఎంత ఉంటుందో చెప్పలేము కాని, అనర్థాలే అధికంగా ఉంటాయి. ఒక్కోసారి అవసరమైన యాప్స్ నుంచి అనవసరమైన, ప్రమాదకరమైన యాప్స్‌లోకి వెళ్లిపోతుంటారు. తల్లిదండ్రులు దగ్గర ఉండి గమనించకుంటే పిల్లలు చెడుదారి పట్టే ప్రమాదం ఉంటుంది. అలాగే సోషల్ మీడియా అకౌంట్లు తెరిస్తే పిల్లలు పక్కదారి పట్టే ప్రమాదం కూడా లేకపోలేదు.
కంట కనిపెట్టాలి
దసరా సెలవుల్లో విద్యార్థులను కంట కనిపెట్టాలి. సృజనాత్మకత, నైతికత విలువలు పెంచేందుకు కథల పుస్తకాలు చదివించాలి. దీనివల్ల పుస్తక పఠనం పెరుగుతుంది. సెల్‌ఫోన్స్‌కు పిల్లలను దూరంగా ఉంచే విధంగా చూడాలి.
– డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈవో,
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
సోషల్ మీడియాతో ప్రమాదం
పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్‌తో పిల్లలు అనుకోని ప్రమాదాల్లో చిక్కుకుంటారు.
– బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం
సహవాస దోషాలతో ప్రమాదాలు
సహవాస దోషంతో వారు వీరవుతారు..వీరు వారవుతారనేది సామెత. మనం చేసే స్నేహాలను బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నది కూడా వాస్తవం. ఇటీవల కాలంలో జిల్లాలో మైనర్లు, విద్యార్థులు మత్తు బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. స్నేహితుల్లో ఎవరికో ఒకరికి సిగరెట్లు, గంజాయి వంటి అలవాటు ఉంటే మిగతావారు చెడు ప్రభావాలకు లోనవుతుంటారు. సరదాగా ఒకసారి మొదలైన అలవాటు, వ్యసనానికి దారి తీస్తుంది. అందుకే సెలవుల్లో పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అప్రమత్తతతోనే భద్రత

అప్రమత్తతతోనే భద్రత