
ఆగని మరణ మృదంగం
తాళ్లపూడి: మండలంలోని పెద్దేవంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. దీంతో పాడి రైతులు విలపిస్తున్నారు. గ్రామానికి చెందిన గెడ్డం మణికంఠకు చెందిన పాడి గేదె కొద్ది రోజులుగా వ్యాధిభారిన పడి మంగళవారం మృతి చెందింది. మందులు వాడినా, వ్యాక్సిన్లు వేసినా ప్రయోజనం లేదని అతను ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం జమ్ముల శ్రీనుకు చెందిన పాడి గేదె కూడా మృతి చెందింది. మృతి చెందిన గేదెలను బయటకు తరలించడానికి రూ.15 వేల వరకు ఖర్చు అవుతోందని రైతులు చెబుతున్నారు. గ్రామంలో ఇప్పటి వరకు 23 మంది రైతులకు చెందిన 33 గేదెలు అంతు చిక్కని వ్యాధి బారిన పడి మృత్యువాత పడ్డాయని రైతులు చెబుతున్నారు.