
పరిశ్రమల కాటుష్యంపై ఆగ్రహం
న్యాయం చేయాలంటూ రోడ్డెక్కిన మత్స్యకారులు
కొత్తపల్లి: తీర ప్రాంతంలో నిర్మించిన కాలుష్య పరిశ్రమలతో సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద లభించక జీవనోపాధి కోల్పోయామని మత్స్యకారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. మత్స్యకారుల సమస్యలపై ఉప్పాడ బీచ్‌రోడ్డు సెంటర్‌లో మంగళవారం అమీనాబాదు, ఉప్పాడ గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఆందోళన నిర్వహించారు. మత్స్యకారులకు మద్దతుగా వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. బీచ్‌రోడ్డు వైపు వెళ్ళే అన్ని రోడ్లను మూసివేశారు. పరిశ్రమలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశ్రమలు విడుదల చేసే కలుషిత వ్యర్థాల వల్ల సుమారు 20 కిలోమీటర్ల మేర సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయని, దీంతో మత్స్యసంపద అంతరించిపోతోందని చెప్పారు. ఆరు నెలులుగా మత్స్య సంపద లభించక జీవనోపాధి కోల్పోయామని, ఓఎన్‌జీసీ, రిలయన్స్ పరిశ్రమలు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో గాడిమొగతో పాటు పరిసర గ్రామాల్లో ఏ విధంగా పరిహారం ఇస్తున్నారో ఆ విధంగానే అందించాలని కోరారు. పరిశ్రమల్లో మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలని, బోట్లుకు ఇచ్చే ఆయిల్ సబ్సిడీ పెంచాలని అమీనాబాదులో నిర్మించిన హార్బరులో మార్పులు చేయాలి, నిర్మించిన వాలు వలన దెబ్బతిన్న బోట్లు, వలలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఉప్పాడ, కోనపాపపేట తీరప్రాంత గ్రామాల్లో రాతి గోడను నిర్మించడంతో పాటు తమ సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మత్స్యకారులతో చర్చించిన అధికారులు
ఆందోళన చేస్తున్న మత్స్యకారులతో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డీఓ మల్లిబాబు, తహసీల్దారు చిన్నారావు చర్చించారు. అయినా వారు ఆందోళన విరమించేలేదు. దీంతో కలెక్టర్ షన్మోహన్ సగిలి స్ధానిక తహసీల్దారు కార్యాలయంలో మత్స్యకారులతో చర్చించేందుకు ప్రయత్నించగా వారు నిరాకరించారు.
కోనపాపపేటలో సంఘీభావం
ఉప్పాడలో ఆందోళన నిర్వహిస్తున్న మత్స్యకారులకు సంఘీభావంగా కోనపాపపేటలోని మత్స్యకారులు ఆందోళన నిర్వహించారు. బీచ్‌రోడ్డులో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు.

పరిశ్రమల కాటుష్యంపై ఆగ్రహం