
సాధనతో దైవ బలం
శ్రీ పీఠంలో రెండో ప్రసంగంలో
పరిపూర్ణానంద స్వామి
కాకినాడ రూరల్: సాధనతోనే దైవబలం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దైవ బలంతోనే అమ్మ అనుగ్రహం పొందుతారని పరిపూర్ణానంద స్వామి అభిభాషించారు. మహాశక్తి యాగం కార్యక్రమంగా రమణయ్యపేటలోని శ్రీ పీఠంలో రెండో రోజు మంగళవారం వేలాది మంది మహిళలు దీక్షా వస్త్రాలను ధరించి రూ.వంద కోట్ల కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం అర్గల స్తోత్ర ఐశ్వర్యాంబిక హోమం, సాయంత్రం లక్ష బిల్వార్చన నిర్వహించారు. ఐశ్వర్యాంబిక అమ్మవారు రెండో శ్రీ హరిద్రా దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహాశక్తి యాగం కుంకుమార్చనలలో భాగంగా మూడు సార్లు లలితా సహస్ర నామార్చనలను పరిపూర్ణనంద స్వామి భక్తులతో పఠింపజేసి కుంకుమార్చన చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక బీజం(విత్తనం) మొలకెత్తాలంటే ఐదు కారణాలు ఉంటాయని వాటిలో ఐదవది దైవమన్నారు. మొట్ట మొదటిది భూమి గర్భంలో ఉన్న జలధారలని, రెండవది సారవంతమైన భూమి, 3వ కారణం విత్తనంలోని శక్తి అని, 4వ కారణం నైసర్గిక సహకారం అన్నారు. ఇవన్నీ ఉన్నా దైవ అనుగ్రహం ఉండాలన్నారు. మనిషి అమ్మవారిని తమలో శక్తిగా నిలుపుకోగలిగే అంత సాధన పొందాలన్నారు. మనం మూలాలను తెలుసుకోగలిగితేనే ముందుకు వెళ్లగలుగుతామన్నారు. ఇందుకోసం చాలా వాటిని త్యాగించాలన్నారు. నీ సంతానంగా భావించి నన్ను నడిపించు అని అమ్మవారిని వేడుకోవాలన్నారు. నవరాత్రుల్లో తొలి రోజు ఐశ్వర్యాంబిక అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా చూసుకున్నామని, అమ్మవారికి అర్చన చేసిన లక్ష అంకురాలను అన్న ప్రసాదంలో వినియోగించామన్నారు.

సాధనతో దైవ బలం