
ఆంధ్రా క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీనివాస్
అంబాజీపేట: అంబాజీపేటకు చెందిన నిమ్మకాయల ఎస్.ఎస్.ఎస్. శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రంజీ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా మరోసారి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి ఉత్తర్వులు అందినట్టు శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఆయన ప్రస్తుతం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అకాడమీ క్రికెట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఆయన రంజీ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించారు. అంబాజీపేటకు చెందిన శ్రీనివాస్ క్రీడాకారునిగా సైతం రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందారు. 2005లో ఏపీ రంజీ క్రికెట్ జట్టు ప్రోబబుల్స్‌కు ఎంపికయ్యారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన క్రికెట్ పోటీల్లో ఏపీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అంబాజీపేటలో నిర్వహించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రికెట్ సబ్ సెంటర్ కోచ్‌గా ప్రస్థానం ప్రారంభించిన శ్రీనివాస్ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. 2014 నుంచి 2022 వరకూ కడప జిల్లాలో ఏసీఏ అకాడమీ కోచ్‌గా సేవలందించారు. తరువాత మంగళగిరి, విజయనగరం అకాడమీలలో కూడా పనిచేశారు. ప్రస్తుతం మంగళగిరి అకాడమీ అసిస్టెంట్ కోచ్‌గా రాష్ట్ర అండర్–14 జట్టుకు రెండుసార్లు, అండర్–16 జట్టుకు ఒకసారి కోచ్ వ్యవహరించారు. తనను రంజీ జట్టు కోచ్‌గా ఎంపిక చేయడం పట్ల ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, ఏసీఏ ఎఫెక్స్ కౌన్సిల్ సభ్యులకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.