
బీమా.. దూరం
● ‘ఫ్రీ’మియం.. మంగళం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంట బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టి.. ప్రీమియం చెల్లింపు విధానాన్ని తీసుకుని వచ్చింది. ఇది భారం కావడంతో పలువురు రైతులు ఈ పథకానికి దూరమవుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 2.10 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. దీంతో పాటు పత్తి, మొక్కజొన్న, అరటి వంటి వాణిజ్య పంటలు కూడా సాగు చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లూ ఉచిత పంటల బీమా అమలు చేశారు. నోటిఫై చేసిన పంటలు ఈ–క్రాప్‌లో నమోదైతే చాలు.. బీమా వర్తింపజేసేవారు. ఆ ఐదేళ్లలో పంటల బీమా కింద అన్నదాతలకు రూ.96.51 కోట్ల మేర అందించారు. ఇది పంటలు నష్టపోయిన రైతులకు కొండంత అండగా నిలిచింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రీమియం చెల్లించిన రైతులకే పంటల బీమా అమలు చేస్తున్నారు. ఇలా ప్రీమియం చెల్లించడం భారమవుతూండటంతో అనేక మంది రైతులు పంటల బీమా పొందలేకపోతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 1.90 లక్షల మంది రైతులుండగా.. వీరిలో ఈ ఏడాది ఇప్పటి వరకూ సుమారు 40 వేల మంది మాత్రమే పంటల బీమా చేయించుకున్నారు. మిగిలిన 1.50 లక్షల మంది దీనికి దూరమయ్యారు.
ప్రీమియం భారమై..
ఎకరా వరి పంటకు బీమా చేయించుకోవాలంటే రైతులు సంబంధిత బీమా కంపెనీకి రూ.678 ప్రీమియం చెల్లించాలి. వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల కారణంగా ఎకరా వరి పంట దెబ్బ తింటే బీమా కంపెనీ ఆయా రైతులకు రూ.24 వేల వరకూ పరిహారం చెల్లిస్తుంది. సాగుదార్లలో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారు. వీరు సుమారు 10 ఎకరాల వరకూ కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తూంటారు. వీరు పంటల బీమా పొందాలంటే పదెకరాలకు ప్రీమియం కింద రూ.6,780 చెల్లించాలి. ఇది భారం కావడంతో అనేక మంది రైతులు పంటల బీమాకు విముఖత చూపుతున్నారు. ఉదాహరణకు కొత్తపల్లి మండలంలో 1,987 మంది, కరప మండలంలో 8,212 మంది మాత్రమే బీమా చేయించుకోగా మిగిలిన వారు ఈ పథకానికి దూరమయ్యారు. చాలా మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే బీమా కంపెనీలు సంబంధిత రైతులకు పరిహారం చెల్లిస్తాయి. ప్రస్తుతం వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. రైతులు ఇప్పటికే ఎకరాకు రూ.15 వేలు పైగా పెట్టుబడి పెట్టారు. ఈ పరిస్థితుల్లో ఇటు ఉచిత బీమా లేక.. అటు తాము ప్రీమియం చెల్లించలేని పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే తమ గతేం కావాలని రైతులు కలత చెందుతున్నారు.
రుణం తీసుకున్న వారికే పంటల బీమా
డీసీసీబీతో పాటు, ఇతర వాణిజ్య బ్యాంకుల నుంచి రైతులు పంట రుణాలు తీసుకుంటే వారు తీసుకున్న రుణం నుంచి పంటల బీమా ప్రీమియాన్ని తగ్గించుకుని, మిగిలిన మొత్తాన్ని రైతులకు ఇస్తారు. దీంతో, రుణాలు తీసుకున్న రైతుల పంటలకు బీమా వర్తిస్తోంది. ఆవిధంగా రుణాలు తీసుకోని రైతులు, కౌలు రైతులకు పంటల బీమా సదుపాయం లేకుండా పోయింది. గత ఏడాది ఖరీఫ్, రబీల్లో అధిక వర్షాల కారణంగా అధిక విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లింది. గత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 70 వేల ఎకరాల్లో వరి పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. అప్పట్లో రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల చొప్పున మాత్రమే పరిహారం ఇచ్చింది. అదే ఉచిత పంటల బీమా అమలు చేసి ఉంటే రైతులకు రూ.20 వేలకు తక్కువ కాకుండా పరిహారం అంది ఉండేది. కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టడంతో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు.
ఉచిత బీమా అమలు చేయాలి
గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా అమలు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరిగేది. ప్రస్తుతం పంటల బీమా ప్రీమియం చెల్లించడం చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఐదెకరాలు సాగు చేస్తున్నారు. ప్రీమియం చెల్లించాలంటే రూ.3,390 చెల్లించాలి. అంత డబ్బు చెల్లించడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది.
– నున్న వెంకటేశ్వరరావు, రైతు,
విజయరాయుడుపాలెం, కరప మండలం
ఉచితాన్ని ఎత్తివేసిన కూటమి సర్కారు
ఎకరానికి రూ.678 చెల్లిస్తేనే పంటల బీమా
ఆ మేరకు రైతులపై భారం
జిల్లాలో సాగుదార్లు సుమారు 1.90 లక్షలు
ప్రీమియం చెల్లించిన వారు 40 వేల మందే
ప్రభుత్వ నిర్ణయంతో 70 శాతం
మందికి అన్యాయం

బీమా.. దూరం