
మనసు పెట్టి పూజిస్తేనే అమ్మ కరుణ
● మహాశక్తి యాగం ప్రారంభ కార్యక్రమంలో
పరిపూర్ణానంద స్వామి
● శ్రీపీఠంలో ఘనంగా కుంకుమార్చనలు
కాకినాడ రూరల్: అమ్మవారిపై మనస్సు ఉంచి పూజలు చేస్తేనే అమ్మవారి కరుణ లభిస్తుందని కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా స్థానిక రమణయ్యపేట శ్రీపీఠంలో సోమవారం మహాశక్తి యాగం ఘనంగా ప్రారంభమైంది. వరుసగా మూడో సంవత్సరం వంద కోట్ల లలితా సహస్ర నామార్చనలతో కుంకుమ పూజలు నిర్వహించేందుకు తొలి రోజు అంకుర్పారణ చేశారు. తొలుత యాగ వేదికపై కొలువైన లలిత, బగళాముఖి, వారాహి అమ్మవార్లు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీదేవీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి మూర్తులకు హారతి ఇచ్చి, వంద కోట్ల కుంకుమార్చనలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ, లలితా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, మీ సంకల్పం నెరవేరాలని తాను కోరుకుంటూ మహాశక్తి యాగం చేపడుతున్నానని చెప్పారు. మూడో సంవత్సరం మహాశక్తి యాగంలో పాల్గొనేందుకు సుమారు 36 వేల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, వారందరికీ చివరిలో ఐశ్వర్య రక్ష (రాగి కంకణం) అందజేస్తామన్నారు. భక్తులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేశామన్నారు. మహాశక్తి యాగంలో సేవ చేసేందుకు సుమారు 3,600 మంది ముందుకు వచ్చారని తెలిపారు. సంకల్పమే అందరినీ ముందుకు నడిపిస్తుందని, అది నెరవేరితే ఆనందం కలుగుతుందని, కాకినాడలో మహాశక్తి యాగం ఒక సంకల్పమైతే.. దేశంలోనే ఎక్కడ జరగని విధంగా తమ పీఠంలో వెయ్యి కోట్ల కుంకుమార్చనలు చేయాలనేది మహాసంకల్పమని అన్నారు. తొలి రోజు రెండుసార్లు సహస్ర నామార్చనలు, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని భక్తులతో చేయించారు. సుమారు 15 వేల మంది భక్తులు హాజరైనట్టు స్వామీజీ తెలిపారు.
భక్తులకు మహాశక్తి యాగం గురించి వివరిస్తున్న
పరిపూర్ణానంద స్వామి

మనసు పెట్టి పూజిస్తేనే అమ్మ కరుణ

మనసు పెట్టి పూజిస్తేనే అమ్మ కరుణ