
బీమాపై జీఎస్టీ తగ్గింపు సరైన నిర్ణయం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జీవిత, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంపై జీఎస్టీ రద్దు నిర్ణయం సరైనదేనని కాకినాడ మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. బీమా ప్రీమియంపై జీఎస్టీని సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో గీతను ఆమె నివాసంలో ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్స్ అసోసియేషన్ నాయకులు సత్కరించారు. గతంలో కాకినాడ ఎంపీగా ఉన్న సమయంలో బీమా ప్రీమియంపై జీఎస్టీ కారణంగా 30 కోట్ల మంది ఇబ్బంది పడుతున్న విషయాన్ని గీత పార్లమెంటులో ప్రస్తావించారు. ఆమె కృషి కారణంగానే కేంద్రం జీఎస్టీ రద్దు చేసిందని ఎల్‌ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లు ఆనందం వ్యక్తం చేశారు. గీతను సత్కరించిన వారిలో ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం రాజమహేంద్రవరం డివిజన్ అధ్యక్షుడు రావుల మాధవరావు, ట్రెజరర్ పి.రెడ్డమ్మ, పిఠాపురం బ్రాంచ్ ఏజెంట్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎల్.రామకృష్ణ, కేవీవీ సత్యనారాయణ, ట్రెజరర్ కె.రాంబాబు, పెద్దాపురం బ్రాంచ్ ఉపాధ్యక్ష కార్యదర్శులు ఎస్.గోపి, ఎస్‌వీవీ సత్యనారాయణ, కాకినాడ బ్రాంచి అధ్యక్షుడు పి.ప్రసాద్, కాకినాడ మెయిన్ బ్రాంచి అధ్యక్షుడు వంగా త్రిమూర్తులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీ వైద్యుల
సమస్యలు పరిష్కరించాలి
కాకినాడ క్రైం: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యులు డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరసింహ నాయక్‌కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఏళ్ల తరబడి తమ సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ పెద్దలకు ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. ఇన్ సర్వీస్ పీజీ కోటాను పునరుద్ధరించాలని, టైమ్ బౌండ్ ప్రమోషన్లు, 50 శాతం ప్రాథమిక వేతనాన్ని గిరిజన భత్యంగా మంజూరు చేయాలని కోరారు. నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేసి, నెలవారీ రూ.5 వేల మొత్తాన్ని చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమం కోసం భత్యంగా ఇవ్వాలన్నారు. స్థానికతతో పాటు పట్టణ అర్హత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో తాము ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారం చూపాలని, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ప్రజారోగ్య సంరక్షణ దృష్ట్యా ప్రభుత్వం సమ్మె విరమణ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. డీఎంహెచ్‌వోను కలిసిన వారిలో వైద్యులు అరుణ, ప్రభాకర్, ప్రశాంతి, రవికుమార్, విల్సన్, అర్చన, బాబు శివ, మౌనిక, ప్రత్యూష, సాయి రోహిత, ఈశ్వర్ కుమార్, కమల్‌నాథ్ ఉన్నారు.
బాలాత్రిపుర సుందరిగా
విజయదుర్గా అమ్మవారు
రాయవరం: వెదురుపాక విజయదుర్గా పీఠంలో శరన్నవరాత్ర ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.19 గంటలకు పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ గాదె సత్య వెంకటకామేశ్వరి కలశస్థాపన ప్రతిష్ఠించారు. విజయదుర్గాదేవి ఉత్సవమూర్తి సహిత పంచాయతన దేవతలు, శ్రీదేవి, భూదేవి సమేత విజయవేంకటేశ్వరస్వామి విగ్రహాల మధ్య వేలాదిగా భక్తులు కలశాలను ఏర్పాటు చేసుకున్నారు. తొలిరోజు 1,050 మంది కలశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ, నవగ్రహఅర్చన, గోపూజ, శ్రీచక్ర అర్చనతో పాటు, సప్తశతి పారాయణం, రుద్రాభిషేకం, గణపతి, నవగ్రహ, రుద్ర, మృత్యుంజయ, నక్షత్ర హోమాలు, దేవీయాగం నిర్వహించారు. విజయదుర్గా అమ్మవారిని పూలు, సర్వాభరణాలతో బాలాత్రిపుర సుందరీదేవిగా నయనానందకరంగా అలంకరించారు. పీఠాధిపతి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్వో వి.వేణుగోపాల్(బాబి), విజయదుర్గా సేవా సమితి ప్రతినిధుల ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు.

బీమాపై జీఎస్టీ తగ్గింపు సరైన నిర్ణయం

బీమాపై జీఎస్టీ తగ్గింపు సరైన నిర్ణయం