
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను మానుకోవాలి
● ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలి
● సీపీఎం జిల్లా రౌండ్ టేబుల్
సమావేశం డిమాండ్
అమలాపురం టౌన్: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అమలాపురం ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరింది. స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ప్రభుత్వం చేపడుతున్న పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలకు పిలుపునిచ్చింది. పలు ప్రజా సంఘాల ప్రతినిధులు కూటమి ప్రభుత్వ పీపీపీ విధానాన్ని ఖండించారు. సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దడాల సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుబ్బారావు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్యం కొనసాగాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్వహించాలన్న నిర్ణయం పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకేనని అభిప్రాయపడ్డారు. విలువైన ప్రజాధనాన్ని ప్రైవేటు వారికి కారుచౌకగా కట్టబెట్టే పీపీపీ విధానంతో వైద్య రంగాన్ని ప్రైవేటీకరించాలనుకోవడం సరికాదని విమర్శించారు. పీపీపీ విధానానికి ఈ ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని పార్టీ జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు ఆరోపించారు. కామనగరువు, సమనస గ్రామాల సరిహద్దుల్లో అమలాపురం ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణాలు దాదాపు 50 శాతం పూర్తయ్యాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వం సదుద్దేశంతో రాష్ట్రంలో పలు మెడికల్ కాలేజీల నిర్మాణాలు 30 నుంచి 50 శాతం పూర్తి చేస్తే, కూటమి ప్రభుత్వం అవి చూపకుండా ఖాళీ స్థలాలను, పునాది దశల్లో ఉన్న పాత ఫొటోలను చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు. అమలాపురం ప్రభుత్వ వైద్య కళాశాల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు ఎ.రవి, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, కేవీపీఎస్ జిల్లాకన్వీనర్ శెట్టిబత్తుల తులసీరావు, యూటీఎఫ్ నాయకులు బీఎన్ వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్ తదితరులు కూడా ప్రసంగించారు.