● అపరాధ రుసుం లేకుండా
అక్టోబర్ 10 తుది గడువు
● ఆలస్యమయ్యే కొద్దీ పెరగనున్న
అపరాధ రుసుం
● జిల్లాలో 27,618 మంది
ఇంటర్ విద్యార్థులు
రాయవరం: వచ్చే విద్యా సంవత్సరంలో నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి తొలి అడుగు పడింది. పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. అపరాధ రుసుం లేకుండా ఇంటర్మీడియెట్ పరీక్ష ఫీజు చెల్లింపునకు అక్టోబర్ 10వ తేదీ తుది గడువుగా ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించింది. 2026 మార్చిలో జరగనున్న ఇంటర్ పరీక్షలకు ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్ష ఫీజు ఈ నెల 15వ తేదీ నుంచి చెల్లించే విధంగా ఇంటర్మీడియేట్ బోర్డు కమిషనర్ ఆదేశాలు విడుదల చేశారు. అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అక్టోబర్ 10వ తేదీ వరకు తొలుత గడువు విధించింది. అక్టోబర్ 11 నుంచి 21వ తేది వరకు రూ.1,000 అపరాధ రుసుముతో చెల్లించే అవకాశం ఉంది. అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజును చెల్లించేందుకు విద్యార్థులు అప్రమత్తమవ్వాలని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు.
పరీక్ష ఫీజుల చెల్లింపు ఇలా..
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్/ఒకేషనల్ విద్యార్థులు థియరీ పరీక్ష నిమిత్తం రూ.600 చెల్లించాల్సి ఉంది. జనరల్ కోర్సులు చదివే సైన్స్ విద్యార్థులు ప్రాక్టికల్స్ (సెకండియర్ విద్యార్థులు మాత్రం) రూ.275 చెల్లించాల్సి ఉంది. ఒకేషనల్ కోర్సు చదువుతూ బ్రిడ్జి కోర్సు చేసే విద్యార్థులు బ్రిడ్జి కోర్సు సబ్జెక్టులకు పరీక్ష రుసుంగా రూ.165 చెల్లించాల్సి ఉంటుంది. సెకండియర్ చదువుతూ ఫస్టియర్ సబ్జెక్టులు ఫెయిలైన విద్యార్థులు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం థియరీ ఫీజు కలిపి రూ.1,200 చెల్లించాలి. ఒకేషనల్ కోర్సు చదువుతూ ఫస్టియర్, సెకండియర్ ప్రాక్టికల్స్ రాసే విద్యార్థులు రెండేళ్లకు కలిపి రూ.550 చెల్లించాలి. బ్రిడ్జి కోర్సు చదివే విద్యార్థులు రెండేళ్లు పరీక్షలు కడితే రూ.330 చెల్లించాలి.
ఫస్టియర్, సెకండియర్ పాసై ఉండి, మార్కులు ఇంప్రూవ్‌మెంట్‌కు పరీక్ష రాసే ఆర్ట్స్ విద్యార్థులు రూ.1,350 వంతున, సైన్స్ విద్యార్థులు రూ.1,600 వంతున పరీక్ష ఫీజుగా చెల్లించాలి.
జిల్లాలో పరిస్థితి ఇదీ..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 130 జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 13, ఎయిడెడ్ ఒకటి, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఆరు, హైస్కూల్ ఫ్లస్ 19, ఒకేషనల్ కళాశాలలు 25, ప్రైవేట్ కళాశాలలు 66 ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్ 13,750 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. సెకండియర్ విద్యార్థులు 13,868 మంది చదువుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు (ఐపీఈ) రాయాలంటే దరఖాస్తుతో పాటు పరీక్ష ఫీజును తప్పనిసరిగా చెల్లించాలి. జిల్లాలో 27,618 మంది విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంది.
గడువులోగా చెల్లించాలి
పరీక్ష ఫీజును గడువులోగా చెల్లించాలని ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు ఆదేశాలు ఇచ్చాం. పరీక్ష ఫీజు సకాలంలో చెల్లించే విధంగా విద్యార్థులను అప్రమత్తం చేయాలని సూచించాం. గడువు ముగిసిన తర్వాత అపరాధ రుసుంతో చెల్లించాల్సి వస్తుంది.
– వనుము సోమశేఖరరావు,
ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఇంటర్ పరీక్ష ఫీజుకు వేళాయె