
గంధం చెట్ల దొంగలు దొరికారు
రాజానగరం: మండలంలోని నందరాడలో గంధం చెట్లను దొంగిలించినవారిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన స్థానిక సీఐ వీరయ్యగౌడ్ సోమవారం ఇక్కడ మీడియాకు తెలిపిన వివరాలిలావున్నాయి. నందరాడలో ఒక రైతుకు చెందిన 12 ఎకరాల తోటలో కొబ్బరి, మామిడి, టేకు, ఎర్రచందనంతోపాటు గంధం చెట్లు కూడా ఉన్నాయి. వీటిలో రెండు గంధం చెట్లను ఈ నెల 16న గుర్తు తెలియని వ్యక్తులు మొదళ్ల వరకు నరికి తీసుకుపోయారు. ఈ మేరకు ఆ తోట కాపలాదారు దొడ్డా సోమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన రాజానగరం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్ని జిల్లా సుగవాన్‌కు చెందిన జులిస్ ఆదివాసీ, శివరాజ్ ఆదివాసీ, ఉల్లిస్‌లను నిందితులుగా గుర్తించి, దివాన్‌చెరువు జీరో పాయింట్ వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి 53 గంధం ముక్కలను, చెట్టు నరకడానికి ఉపయోగించిన పరికరాలను స్వాధీన పర్చుకున్నారు. దొంగిలించిన రెండు గంధం చెట్ల విలువ రూ.3.50 లక్షలకు పైనే ఉంటుందన్నారు. గతంలో కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో జరిగిన గంధం చెట్ల చోరీ కేసులో శివరాజ్ ఆదివాసీ నిందితునిగా ఉన్నాడు. ఇది ఒక ముఠా అని, ఇందులో ఉన్న సభ్యులంతా ఒక కుటుంబం మాదిరిగా గ్రామ శివార్లలో గుడారాలు వేసుకుని, రుద్రాక్షలు, కాశీ తాళ్లు, గవ్వలు అమ్ముతూ సంచరిస్తుంటారన్నారు. ఆయా ప్రాంతాలలో ఉండే గంధం చెట్లను టార్గెట్‌గా చేసుకుని వీరి సంచార జీవితం నడుస్తుందన్నారు. వీరిని గైడ్ చేసేది మాత్రం కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్‌కి చెందిన రాజా అని పేర్కొన్నారు. ఇతనిపై కూడా ఏలూరు పోలీసు స్టేషనులో కేసులున్నాయని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై ఎస్.ప్రియకుమార్, హెడ్ కానిస్టేబుల్ పి.అమ్మిరాజు, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, కరీమ్, వెంకటరమణ, నాగేశ్వరరావు, కిషోర్‌కుమార్ పాల్గొన్నారు.