
అప్పు ఎగ్గొట్టేందుకే హతమార్చాడు!
ఫ మధ్యవర్తులను బావిలోకి తోసేసిన వైనం
ఫ ఇద్దరి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
పిఠాపురం: అప్పు ఎగ్గొట్టేందుకు పథకం వేశాడు.. ఇందులో ఇద్దరు మధ్యవర్తులను హతమార్చి, ఆపై అప్పు ఇచ్చిన వ్యక్తినీ చంపేయాలని ప్రయత్నించిన ఘటనలో నిందితుడు కటకటాల పాలయ్యాడు. ఈ కేసులో నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయాన్ని గొల్లప్రోలు పోలీస్ స్టేషన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ నెల 16న తాటిపర్తిలో ఇద్దరిని హత్య చేసి, ఒక వ్యక్తిపై హత్యాయత్నం చేసిన ఘటనపై గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాల ప్రకారం.. ఏడాది కిందట తాటిపర్తి గ్రామానికి చెందిన రంపం గంగాధర్ అదే గ్రామానికి చెందిన కుంపట్ల సూరిబాబు వద్ద రుణం తీసుకున్నాడు. ఆ సందర్భంలో తన బంధువులైన రంపం శ్రీనివాస్, తోరాటి సూరిబాబులను మధ్యవర్తులుగా పెట్టి అప్పు తీసుకున్నాడు. కొంత కాలంగా అప్పు తీర్చమని సూరిబాబు అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మధ్యవర్తులుగా ఉన్న రంపం శ్రీనివాస్, తోరాటి సూరిబాబులపై కుంపట్ల సూరిబాబు ఒత్తిడి తెచ్చాడు. వీరందరూ కలసి అప్పు తీర్చాలంటూ గంగాధర్‌ను అడిగారు. దీంతో ఆ ముగ్గురినీ చంపేస్తే ఇక అప్పు తీర్చాల్సిన అవసరం లేదని భావించిన గంగాధర్ ఓ పథకం రచించాడు. ముందుగా సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం ఫ్రైడ్ రైస్ పార్టీ ఇస్తానని చెప్పి మధ్యవర్తులుగా ఉన్న రంపం శ్రీనివాస్, తోరాటి సూరిబాబులను ఫోన్ చేసి రమ్మన్నాడు. వారంతా తాటిపర్తి ఎన్టీఆర్ కాలనీ శివారు మొగిలి చిన్న పొలంలోని బావి వద్దకు వెళ్లి కలసి తింటున్నారు. శ్రీనివాస్, తోరాటి సూరిబాబు ఫ్రైడ్ రైస్ తింటుండగా అదును చూసి వారిని బావిలోకి తోసి హతమార్చాడు. అనంతరం అదేరోజు రాత్రి అప్పు ఇచ్చిన వ్యక్తి కుంపట్ల సూరిబాబును కూడా టీ తాగడానికి గొల్లప్రోలు వెళ్దామంటూ ఫోన్ చేసి రమ్మన్నాడు. అతను వచ్చాక బైక్ ఎక్కించుకుని తాటిపర్తి గ్రామ శివారులోని పుంత రోడ్డులో కొండ కాలువ వాగు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కావాలనే ముందుగా తన సెల్ ఫోన్ కాలువలో పడేసి కుంపట్ల సూరిబాబును తన సెల్‌ఫోన్ లైట్ వేయాలని అడిగాడు. ఇలా వెతుకుతున్నట్లు నటించి సూరిబాబును కూడా కొండ కాలువలో ముంచి హతమార్చాలని గంగాధర్ ప్రయత్నించాడు.
దీంతో అప్రమత్తమైన సూరిబాబు తప్పించుకుని, తర్వాత రోజు ఉదయం తాటిపర్తి గ్రామానికి వచ్చి జరిగిన విషయాన్ని మృతుల బంధువులకు తెలిపాడు. దీంతో మృతుల బంధువులు వెళ్లి మొగిలి చిన్న పొలంలోని బావిలో చూడగా, ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు గొల్లప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీశ్ పర్యవేక్షణలో పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. రంపం గంగాధర్ విశాఖపట్నం పారిపోయి డబ్బులు అయిపోవడంతో తన మోటార్ సైకిల్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని మళ్లీ దూరంగా వెళ్లిపోవడానికి పిఠాపురం రైల్వే స్టేషన్‌కు రాగా, అతనిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.