
వనదుర్గమ్మకు ప్రత్యంగిర హోమం
అన్నవరం: రత్నగిరి వన దేవత వనదుర్గమ్మ వారికి భాద్రపద అమావాస్య పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత హోమం ప్రారంభించి, హోమ ద్రవ్యాలు సమర్పించి పూర్ణాహుతి నిర్వహించారు. వేద పండితులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. అమ్మవారికి ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. ప్రత్యంగిర హోమంలో 20 మంది భక్తులు రూ.750 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేసి పాల్గొన్నారు. వేద పండితులు యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, వనదుర్గమ్మ ఆలయ అర్చకుడు ప్రయాగ రాంబాబు, పరిచారకులు చిట్టెం వాసు, వేణు, వ్రత పురోహితులు చెల్లపిళ్ల ప్రసాద్, కూచుమంచి ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు.
టేకు రథంపై సత్యదేవుని ఊరేగింపు
అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథసేవ నిర్వహించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి పరిచారకులు శివ, గాడేపల్లి పవన్ తదితరులు పూజలు చేశారు. అనంతరం ఊరేగించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా మూడు సార్లు ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించారు.

వనదుర్గమ్మకు ప్రత్యంగిర హోమం