
నిందితుల అరెస్ట్
గంజాయి కేసులో
కరప: గంజాయి కేసులో ఇద్దరు నిందితులను కరప పోలీసులు అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల కథనం ప్రకారం.. కరప మండలం జెడ్.భావారం గ్రామానికి చెందిన గుణ్ణం రాజశేఖర్ ఇంటి వద్ద కొంతమంది గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో తహసీల్దార్ తుమ్మల దుర్గాప్రసాద్, కరప ఎస్‌ఐ టి.సునీత రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో కలసి వెళ్లేసరికి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు పట్టుకుని, విచారించగా అసలు విషయం బయటపడింది. గుణ్ణం రాజశేఖర్ అనే వ్యక్తి వెన్నపు లక్ష్మీగణపతి (గణేష్)కు డబ్బులు ఇచ్చి కిలో గంజాయి కావాలని అడగ్గా తన వద్దలేదని, తన స్నేహితుడు వాసంశెట్టి బన్ని వద్ద తీసుకు ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత బన్నీ ప్రస్తుతం తన వద్ద గంజాయి లేదని రామచంద్రపురంలోని చెల్లూరి మణికంఠ (లడ్డు) వద్ద ఉందని అన్నాడు. ఈ నెల 20న జెడ్.భావారంలోని రాజశేఖర్ ఇంటి వద్ద గంజాయిని నిందితులు పంచుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 3.174 కిలోల గంజాయిని కరప ఎస్‌ఐ సునీత సీజ్ చేశారు. ఒక చానల్‌లో పాత్రికేయుడిగా చలామణి అవుతున్న రాజశేఖర్ (ప్రథమ నిందితుడు) గణేష్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి, ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్నాడు. మరో నిందితుడు వాసంశెట్టి బన్నీపై రామచంద్రపురంలో గంజాయి కేసు నమోదైంది. నిందితులు రాజశేఖర్, వాసంశెట్టి బన్నీకి సహకరిస్తున్న సత్యలను పోలీసులు అదుపులోకి తీసుకుని, కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు తొలుత నలుగురిని అరెస్ట్ చేయగా, ఇద్దరినే అరెస్ట్ చూపడం అనుమానాలకు తావిస్తోంది. నిందితులు గణేష్, మణికంఠ, బన్నీ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.