
కష్టబడి గెలిచి
క్రీడాస్ఫూర్తితో ఆదర్శ విజయం
ప్రభుత్వ పాఠశాలలో క్రీడలతో మొదలైన తమ స్నేహం ఒకరికి మరొకరం ప్రోత్సహించుకుంటూ పెరిగాం. టీచర్ల కావాలన్నదే ఇద్దరి గమ్యం. డీఎస్సీ పరీక్షలకు సైతం కలిసే చదువుకున్నాం. ఉద్యోగాలు సాధించడం మాత్రమే కాదు.. చదువుల్లోనూ, ఆటల్లోనూ ఆడపిల్లలు తీసిపోరన్నది సమాజానికి చెప్పాలనుకున్నాం. కష్టపడి చదివితే గ్రామీణ బాలికలు లక్ష్యాన్ని సాధించగలరని నిరూపించాం.
– చందక శ్రావణి, సుర్ల కృష్ణవేణి (స్నేహితులు)
● కేఓ మల్లవరం నుంచి 9 మంది
ఉపాధ్యాయులు
● భార్యాభర్తలు, స్నేహితులు,
వదినామరదళ్లకు కొలువులు
● జిల్లాలో చివరైనా.. ఉద్యోగాల్లో ముందంజ
తుని రూరల్: వారంతా ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిచేసిన వారే.. అయితేనేం ఎంతో కష్టమైనా ఇష్టపడి చదివి అనుకున్నది సాధించారు. ఏ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడినా ఆ గ్రామంలోని వారు ఉండాల్సిందే.. అంటే ఆ ఊరిలో ఉద్యోగాల కోసం ఎంత కష్టపడి విజయం సాధిస్తారో అర్థం చేసుకోవచ్చు. డీఎస్సీలో ఏకంగా 9 మంది అభ్యర్థులు ఒకేసారి ఉపాధ్యాయులు కావడం నిజంగా మామూలు విషయం కాదు. కాకినాడ జిల్లాలో శివారు గ్రామంగా అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం సరిహద్దుగా ఉన్న కేఓ మల్లవరం యువత ఉద్యోగాలు సాధించడంలో ముందంజ వేస్తున్నారు. ప్రభుత్వం ఏ ఉద్యోగాలు భర్తీ చేసినా అందులో కేఓ మల్లవరం గ్రామస్తులకు భాగస్వామ్యం తథ్యం. గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించిన విద్యార్థులే కావడం విశేషం. గడిచిన రెండు దశాబ్దాల్లో రెండు వందల మందికిపైగా ఉద్యోగాలు సాధించడం, అందులోనూ అత్యధికులు ఉపాధ్యాయులే కావడం మరో విశేషం. డీఎస్సీ ఫలితాల్లో ఏకంగా తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఎంపికై సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకుని తుది జాబితాలో స్థానం దక్కించుకుని పాఠశాలల్లో విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నారు.

కష్టబడి గెలిచి