
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో కాకినాడ జిల్లా నుంచి పలువురికి చోటు లభించింది. రాష్ట్ర మున్సిపల్ విభాగం జనరల్ సెక్రటరీగా పలకా సూర్యకుమారి, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పేరిశెట్టి ముత్యంజయరావు, సోషల్ మీడియా విభాగం జనరల్ సెక్రటరీగా మంతెన గోపాలకృష్ణంరాజు, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా బత్తుల భీమారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర సెక్రటరీలుగా శెట్టిబత్తుల సురేష్, లోడ అప్పలరాజు, రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధికార ప్రతినిధిగా పిడుగు కృష్ణ, రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ జనరల్ సెక్రటరీగా ములికే సత్యనారాయణ, వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర సెక్రటరీ ఎన్.శ్రీనివాసరాజు, వైఎస్సార్‌టీఎఫ్ జాయింట్ సెక్రటరీగా తొండెపు రఘురామ్‌ప్రసాద్ నియమించారు.
లోవ దేవస్థానంలో నేటి నుంచి
శరన్నవరాత్రులు
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈనెల 22 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు శరన్నవరాత్ర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు ఆదివారం తెలిపారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని తొమ్మిది రోజులు వేదపండితులు, ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో తలుపులమ్మ తల్లికి ప్రత్యేక అలంకరణలు చేస్తామన్నారు. మొదటి రోజు సోమవారం బాలత్రిపుర సుందరి, 23న గాయత్రీదేవి, 24న అన్నపూర్ణాదేవి అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. 25 కాత్యాయనీదేవి, 26న మహాలక్ష్మీదేవి, 27న లలితాదేవి, 28న మహాచండీదేవి, 29న సరస్వతీదేవి, 30న దుర్గాష్టమి పర్వదినాన దుర్గాదేవి అలంకరణలు చేస్తామన్నారు. అక్టోబర్ ఒకటిన మహిషాసురమర్ధినిగా, రెండున విజయదశమి, శమీపూజ సందర్భంగా రాజరాజేశ్వరీదేవిగా విశేష అలంకరణలు చేస్తామన్నారు.
యూటీఎఫ్ రణభేరి సభను
విజయవంతం చేద్దాం
అమలాపురం టౌన్: విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే యూటీఎఫ్ రాష్ట్ర రణభేరి సభను విజయవంతం చేద్దామని జిల్లా యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సురేంద్రకుమార్, ఎంటీవీఏఎస్ సుబ్బారావు పిలుపునిచ్చారు. అమలాపురంలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లా యూటీఎఫ్ ఆఫీసర్స్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో యూటీఎఫ్ రణభేరి జాతాలు నిర్వహించిందని తెలిపారు. గుంటూరులో రాష్ట్ర స్థాయిలో రణభేరి సభ 25న జరుగుతోందని గుర్తు చేశారు.