
కాకినాడలో సీజీహెచ్‌ఎస్ సెంటర్ ఏర్పాటు చేయాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపయోగపడేలా కాకినాడలో సెంట్రల్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్‌ఎస్) సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీలో ఉద్యోగులు, పెన్షనర్ల సంఘ నాయకులు సమావేశం నిర్వహించారు. సుమారు 100 మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొని తమ సమస్యలు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ హాస్పిటల్ ఉందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందన్నారు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడుస్తున్నా ఇంకా సీజీహెచ్‌ఎస్ సెంటర్ రాష్ట్రంలో ఏర్పాటు చేయలేదన్నారు. రాజమండ్రిలో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేసినప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్స్ అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం వెల్‌నెస్ సెంటర్ అయినా కాకినాడలో ఏర్పాటు చేయాలని, అలాగే ఈఎస్‌ఐ ఆసుపత్రికి అనుసంధానం చేస్తే కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ఇబ్బందులు తప్పుతాయన్నా రు. రిఫరల్ ఆసుపత్రి కూడా కాకినాడ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాగా వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, విజయ్‌కుమార్, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘ జనరల్ కార్యదర్శి ఎస్‌వీఎమ్ సాయిరామ్, ఆల్ ఇండియా పోస్టల్, ఆర్‌ఎంఎస్ పెన్షనర్ల అసోసియేషన్ కార్యదర్శి తురగా సూర్యారావు, ఆర్థిక కార్యదర్శి సీహెచ్ రామారావు ఈ సమావేశంలో తమ సంఘీభావం ప్రకటించారు.