పాఠాలు నేర్వరా? | - | Sakshi
Sakshi News home page

పాఠాలు నేర్వరా?

Sep 21 2025 1:21 AM | Updated on Sep 21 2025 1:21 AM

పాఠాల

పాఠాలు నేర్వరా?

రేపటి సమాజానికి ఉత్తమ పౌరులను

తీర్చిదిద్దాల్సిన బృహత్తర బాధ్యత గురువులదే. ఆ గురువులు ఎంతమంది నిష్ణాతులో.. ఎంతమంది కేవలం ‘గురూ’ అని పిలిపించుకునేవారో తెలియని పరిస్థితి నేటి పాఠశాలల్లో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత ప్రమాణాలు.. విద్యా ప్రగతి.. విద్యార్థుల అభ్యసన తదితర వివరాలను సహజంగానే ఆ శాఖ అధికారులు నిర్వహిస్తారు. ఎటొచ్చీ ప్రైవేటు పాఠశాలల విషయంలోనే ఈ బాధ్యతను గుర్తెరిగి వ్యవహరించడం లేదన్నది నిర్వివాదాంశం. క్వాలిఫైడ్‌ టీచర్లు లేని పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల పరిస్థితి రేపు ఏమిటన్నది ప్రశ్నార్థకమవుతోంది. ప్రభుత్వం గుర్తించని పాఠశాలల యాజమాన్యాలు విద్యా సంవత్సరం చివరిలో గుర్తింపు పొందిన పాఠశాలల నుంచి విద్యార్థులను పరీక్షలకు పంపించి వారి పబ్బం గడుపుకొంటున్నారు. ఈ పరిస్థితి ఏటా అక్కడక్కడా బయటపడుతూనే ఉన్నా విద్యాశాఖ మొద్దునిద్ర వీడడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ తనిఖీలు చేపడితే విద్యార్థులకు వెంటనే గుర్తించిన పాఠశాలల్లో చేరే అవకాశం ఉంటుంది. ఆలస్యం జరిగే కొద్దీ ఆయా పాఠశాలల్లో సీట్లు దొరకక విద్యా సంవత్సరాన్ని నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే విద్యా సంవత్సరం మొదలై మూడు నెలలైంది. అధికారులు ఇప్పటికై నా సమాయత్తమై విద్యార్థులు ప్రైవేటుకు బలికాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా విద్యాశాఖ గణాంకాల ప్రకారం ప్రాథమిక 152, ప్రాథమికోన్నత 202, ఉన్నత పాఠశాలలు 219 కలిపి మొత్తం 573 పాఠశాలలకు మాత్రమే గుర్తింపు ఉందంటూ లెక్కల్లో నమోదయింది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా అనధికారికంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ 50–70, ఉన్నత పాఠశాలలు మరో 50 వరకూ ఉంటాయని అంచనా వేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా.. ఇప్పటికీ ఈ ఏడాది జిల్లాలో గుర్తింపు పొందిన పాఠశాలల జాబితా పూర్తి స్థాయిలో లేదు. డివిజన్‌, మండల స్థాయిలో విద్యాశాఖాధికారులు పాఠశాలల తనిఖీ చేపట్టి గుర్తింపు లేని పాఠశాలలపై కొరడా ఝుళిపించేవారు. ముఖ్యంగా కాకినాడ కార్పొరేషన్‌ వంటి ప్రాంతంలో అర్బన్‌ స్కూల్‌ ఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేపట్టి ఏటా కనీసం 10 పాఠశాలలైనా గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేవారు. ఈ విద్యాసంవత్సరంలో అటువంటి చర్యలు ఎక్కడా తీసుకున్న దాఖలాలు లేవు. ఏటా కొత్త పాఠశాలలు జిల్లాలో పుట్టుకొస్తున్నా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల తోక పేర్లతో నూతన బ్రాంచిల పేరిట వివిధ ప్రాంతాల్లో ప్రారంభిస్తున్నారు. ఇందుకు హంగులూ, ఆర్భాటాలతో తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ప్రచారాలు చేస్తూ ప్రవేశాల ప్రక్రియను చేపడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అటువంటి పాఠశాలల్లో చేర్పించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా పాఠశాలలకు అనుమతి ఉన్నదీ లేనిదీ తెలియని పరిస్థితి. ఈ విషయంలో తల్లిదండ్రులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. విద్యాశాఖ నియంత్రణ కొరవడడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఆమోదం ఉన్నట్లు నిర్దేశించుకుంటూ కొన్ని పాఠశాలలు సీబీఎస్‌ఈ అనుమతులు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ప్రైవేటు పాఠశాల ప్రారంభించాలంటే విద్యాశాఖ అనుమతి తీసుకోవాలి. మొదటి ఓపెనింగ్‌ అనుమతి తీసుకున్న తర్వాతే విద్యా సంస్థలను తెరచి విద్యార్థులను చేర్చుకోవాలి. తర్వాత పూర్తి స్థాయి అనుమతి పొందాలి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే విద్యాశాఖ రీజినల్‌ డైరెక్టర్‌ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యా కమిషనర్‌ అనుమతి తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధించేందుకు కేంద్ర విద్యామండలి సమ్మతించాలి. గత విద్యా సంవత్సరం మెట్ట ప్రాంతం జగ్గంపేటలో ఓ కార్పొరేట్‌ పాఠశాల తమకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ ప్రచారాలు చేసుకుని ప్రవేశాలు కల్పించింది. ఈ విషయంపై అవగాహన లేక కొందరు తమ పిల్లలను అందులో చేర్పించారు. పుస్తకాలు తీసుకున్నారు. వేలల్లో ఫీజులు చెల్లించాక పాఠశాలలను మరో పాఠశాలలోకి విలీనం చేశారంటూ తల్లిదండ్రులు ఆందోళన చేశారు.

కచ్చితంగా గుర్తింపు పొంది ఉండాలి

చాలా విద్యాసంస్థల బోర్డులు, ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే రిజిస్టర్డ్‌ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ఎవరైనా చేసుకోవచ్చు, కానీ విద్యాశాఖ నుంచి గుర్తింపు తీసుకోవడం తప్పనిసరి. గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లోనే తల్లిదండ్రులు పిల్లలను చేర్పి ంచాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యాసంస్థల తరఫున పరీక్షలు రాయిస్తుంటారు. అలా పరీక్ష రాసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే పరిగణిస్తుంది. మరికొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు బ్రాంచీల పేరుతో పాఠశాలలను, కళాశాలలను నడుపుతూ ఎక్కడో ఉన్న మెయిన్‌ బ్రాంచి ద్వారా పరీక్షలు రాయిస్తుంటారు. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు కచ్చితంగా విద్యా సంస్థ అనుమతి పత్రాలను అడిగి తెలుసుకోవాలి.

గుర్తింపు జాబితా

విడుదల చేస్తాం

ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలి. విద్యార్థులకు పాఠశాలల్లో క్రీడా మైదానంతో పాటు అన్ని వసతులు ఉండాలి. లేకుంటే ఈ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తాం. విద్యాసంస్థ పక్కా గా రిజిస్ట్రేషన్తో పాటు ప్రభుత్వ గుర్తింపు ఉండాలి. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది గుర్తింపు పొందిన పాఠశాలల వివరాలు తెలియజేస్తాం.

– జి.నాగమణి, విద్యాశాఖ ఆర్‌జేడీ. కాకినాడ

విద్యార్థుల జీవితాలతో చెలగాటం

తమ ఉన్న ఇంటికో లేదో గ్రామానికో దగ్గరగా ఉంటుందన్న కారణంలో ప్రైవేట్‌ పాఠశాల్లో తమ పిల్లలను చేర్పిస్తున్నారు. కనీసం ఆ స్కూళ్లకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయో లేదో కూడా తల్లిదండ్రులకు తెలియడం లేదు. సరైన వసతులు కూడా ఉండటం లేదు. తీరా పరీక్షల సమయం వచ్చేసరికి వేరే పాఠశాల నుంచి పరీక్షలు రాయిస్తున్నారు.

– బి.సిద్దూ, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి

గమనించాల్సిన విషయాలివీ..

తొలుత పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అనేది చూసుకోవాలి.

ప్రభుత్వ ఇంజినీరింగ్‌ విభాగం జారీ చేసిన పాఠశాల భవనం నాణ్యత ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించాలి.

మౌలిక వసతులు చూసుకోవాలి.

మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు తప్పనిసరి. విద్యార్థులు మానసిక, శారీరకోల్లాసానికి ఉపకరించే క్రీడా ప్రాంగణం, అనుగుణంగా క్రీడా ఉ పాధ్యాయులు ఉన్నారా లేదా అని ఆరా తీయాలి.

ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో 20 నుంచి 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఉన్నత పాఠశాల అయితే సబ్జెక్టుల వారీగా ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండాలి.

సురక్షిత రవాణా సదుపాయానికి బస్సులకు రవాణాశాఖ సామర్థ్య పరీక్ష పత్రాన్ని జారీ చేస్తుం ది. సుశిక్షితుడైన డ్రైవరు తప్పనిసరి.

జీ–1 భవనాలు ఉంటే అగ్నిమాపక పరికరాలు, స్థాయి దాటితే మంటలు ఆర్పే పూర్తి స్థాయిలో ఉండాలి.

ప్రభుత్వం అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి.

చైల్డ్‌ ఇన్ఫో ఆధారంగానే విద్యార్థుల ప్రగతి పత్రాలు, బదిలీ ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి లేని వాటిలో ఈ నమోదు ఉండదు. ఆయా విద్యార్థులను బడిబయట ఉన్నవారిగా పేర్కొంటున్నారు. ఫలితంగా సమస్యలు ఏర్పడతాయి.

అనుమతులపై కొరవడిన నిఘా

ప్రారంభం కాని పాఠశాలల తనిఖీ

ఏటా పదుల సంఖ్యలో ప్రారంభం

కొన్నింటికే అనుమతులున్నాయని

విద్యార్థి సంఘాల గగ్గోలు

మీనమేషాలు లెక్కిస్తున్న విద్యాశాఖ

పాఠాలు నేర్వరా?1
1/2

పాఠాలు నేర్వరా?

పాఠాలు నేర్వరా?2
2/2

పాఠాలు నేర్వరా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement