
శృంగార వల్లభుని ఆలయానికి పోటెత్తిన భక్తులు
రూ.2.53 లక్షల ఆదాయం
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి స్వయంభూ శృంగార వల్లభుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందుల తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అర్బకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు స్వామిని పూలదండలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని వివిధ సేవల టిక్కెట్లు, అన్నదానం, కేశ ఖండన ద్వారా స్వామి వారికి రూ.2,53,756 ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. సుమారు 18 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకోగా నాలుగు వేల మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, గ్రామ సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి, ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అన్నవరప్పాడుకు భక్తుల రద్దీ
పెరవలి: అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం వేల మంది భక్తులు పోటెత్తారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. పెద్దసంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్‌లో రద్దీ ఏర్పడింది. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. బండారు సుబ్బారావు దంపతుల ఆర్థిక సాయంతో సుమారు ఎనిమిది వేల మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన స్వామికి పూల అలంకరణ, భక్తులకు ప్రసాదం, నిత్యగోత్రార్చన, అన్నదానాల కు భక్తుల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నామన్నారు.
రాష్ట్ర స్థాయి వెయిట్, పవర్
లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
అమలాపురం టౌన్: రాష్ట్ర స్థాయి వెయిట్, పవర్ లిఫ్టింగ్ పోటీలకు అమలాపురం హెల్త్ అండ్ ఫిట్‌నెస్ జిమ్ క్రీడాకారులు ఎంపికయ్యారని ఆ జిమ్ లైఫ్ టైమ్ మెంబర్ గారపాటి చంద్రశేఖర్ తెలిపారు. ఇటీవల కాకినాడలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వెయిట్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు జి.దినేష్ ప్రసాద్ అండర్–17 విభాగం 79 కిలోల కేటగిరీలో బంగారు పతకం, పవర్ లిఫ్టింగ్ అండర్–19 74 కిలోల కేటగిరీలో కె.నాని బంగారు పతకం, 83 కిలోల కేటగిరీలో వి.సోమశేఖర్ బంగారు పతకాన్ని సాధించారని చెప్పారు. బంగారు పతకాలు సాధించిన ఈ ముగ్గురూ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం జిమ్‌లో జరిగిన అభినందనలో జిమ్ కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు, నేషనల్ వెయిట్ లిఫ్టర్ మారే వీరేంద్ర, సీనియర్ లిఫ్టర్లు జె.జితేంద్రదొర, ఎం.అవినాష్, సీహెచ్ సత్యగోపాల్, చోడే శంకరనారాయణ పాల్గొని విజేతలను ప్రశంసించారు.

శృంగార వల్లభుని ఆలయానికి పోటెత్తిన భక్తులు