సచివాలయ ఉద్యోగుల అల్టిమేటం | - | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగుల అల్టిమేటం

Sep 17 2025 7:37 AM | Updated on Sep 17 2025 7:59 AM

సాక్షి ప్రతినిఽధి, కాకినాడ: ఉన్నత చదువులు చదువుకుని పండగలు, పబ్బాలు లేకుండా వారాంతంలో సెలవు లేకుండా ఇంటింటికీ తిరిగి ఆత్మ గౌరవం చంపుకొని ఉద్యోగం చేయలేక సచివాలయ ఉద్యోగులు నరకం చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా సర్వేలపై సర్వేలు చేయిస్తూ ఉద్యోగం వదిలి పారిపోయేలా చేస్తోందని మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో ఉద్యోగంలో కొనసాగడంపై సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. చదివింది ఉన్నత విద్య అయినా ఏ ఉద్యోగం, ఉపాధి లేని పరిస్థితుల్లో నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ ఉద్యోగాలతో గౌరవ ప్రదమైన హోదా కల్పించారు. సర్వీసు రూల్స్‌ వర్తింపచేసి ఉద్యోగాలు కూడా రెగ్యులరైజ్‌ చేశారు. ఇందుకు సచివాలయ ఉద్యోగులంతా జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞులై ఉన్నారు. సచివాలయంలో ఉద్యోగమంటే సమాజంలో గుర్తింపు, నలుగురికీ సేవలందించే అవకాశం లభించిందని సచివాలయ ఉద్యోగులు చాలా సంతోషించారు. ప్రభుత్వం మారిందే తడవుగా సర్వేలపై సర్వేలు, అదనపు బాధ్యతలు, అనవసర ఒత్తిళ్లు, ఇంటింటికీ తిరుగుతుంటే ఎదురవుతోన్న అవమానాలపై సచివాలయ ఉద్యోగులు కూటమి సర్కార్‌పై సమరశంఖం పూరించేందుకు సమాయత్తమవుతున్నారు. డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి కొంత గడువు ఇచ్చారు. వచ్చే నెల ఒకటో తేదీ డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. ఈ మేరకు వివిధ డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని మంగళవారం సచివాలయ ఉద్యోగుల సంఘం జిల్లా అధికారులకు నివేదించి సమ్మెకు సమాయత్తమవుతోంది. ఇంటింటికీ వెళ్లి పనిచేసే విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్లలో ప్రధానంగా ఉంది. ఇందుకు రెండు వారాలు గడువు ఇస్తూ వచ్చే నెల ఒకటి నుంచి సచివాలయ ఉద్యోగులు మూకుమ్మడిగా సమ్మెకు సిద్ధమవుతున్నారు.

వేధింపులతో సమ్మె యోచన

21కి పైగా ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ గ్రామస్థాయిలో ప్రజా సమస్యలపై స్పందిస్తోన్న మొట్టమొదటి వ్యవస్థ గ్రామ, వార్డు సచివాలయాలు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు పొందిన వారిలో కొంతమందిని కూటమి ప్రభుత్వం అడుగడుగునా వేధిస్తుండడంతో తిరుగుబాటు బావుటా ఎగరేశారు. సచివాలయ ఉద్యోగుల పట్ల వ్యతిరేక ధోరణితో ఉన్న నేపథ్యంలో వారంతా ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తున్నారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి చలనం రాకపోవడంతో వచ్చే రెండు వారాల్లో సమస్యలు పరిష్కరించాలనేది వారి అల్టిమేటం.

అదనపు బాధ్యతలతో నరకం

కాకినాడ జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. కాకినాడ నగరపాలక సంస్థతో పాటు తుని, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం పట్టణాలు, ఏలేశ్వరం, గొల్లప్రోలు నగర పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో 385 గ్రామ పంచాయతీలు, 445 గ్రామ సచివాలయాలు, 175 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో జిల్లా అంతటా కలిపి 5,580 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 14వేల మంది వలంటీర్లు సచివాలయాల పరిధిలో ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను అందజేసేవారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర ఆదేశాలు కూడా క్షేత్రస్థాయిలో అమలు చేసేవారు. కూటమి ప్రభుత్వం గద్దె నెక్కాక సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పి చెప్పాపెట్టకుండా వలంటీర్ల వ్యవస్థపై నిర్దాక్షిణ్యంగా వేటు వేసింది. ఇన్ని వేల మంది అందించే విధులను సచివాలయాల ఉద్యోగులకు అప్పగించి అదనపు భారం మోపింది. ఇలా అదనపు బాధ్యతలతో సచివాలయ ఉద్యోగులు నరకం చూస్తున్నారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ పేరిట కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పరిపాలన విధానంలో ఇంటింటికీ ప్రభుత్వ సేవలందించేలా కార్యక్రమాలతో పాటు సర్వేల బాధ్యతలను సచివాలయ ఉద్యోగులే చేయాల్సి వస్తోంది. రోజువారీ సచివాలయ ఉద్యోగులు చేయాల్సిన పనులతోపాటు ఇంటింటికీ విధులు తమకు ప్రాణసంకటంగా పరిణమించాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విధి నిర్వహణకు ప్రతిబంధకంగా..

సమాజంలో గౌరవప్రదంగా ఉంటుందనే ఉద్దేశంతో ఉద్యోగాల్లో చేరగా ఇప్పుడు నరకం కళ్ల చూస్తున్నామని సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. సర్వేలే విధి నిర్వహణకు పెద్ద ప్రతిబంధకంగా మారాయంటున్నారు. సోమవారం, గురువారం పాఠశాలల్లో టాయిలెట్స్‌పై సర్వే చేయాలనే ఆదేశాలు తలకుమించిన భారమవుతున్నాయి. ఒక సచివాలయ ఉద్యోగి పరిధిలో నాలుగైదు హేబిటేషన్స్‌ ఉండటంతో అన్ని పాఠశాలల్లో సర్వే ఇబ్బందిగా ఉందంటున్నారు. అలాగే ఇంటి పన్ను నిర్ధారణ సర్వే కోసం ప్రతి ఇంటికీ వెళ్లి టేపుతో కొలతలు తీయాల్సి రావడం పెద్ద సమస్యగా మారింది. ఇంటింటికీ వెళ్లి కొలతలు తీస్తుంటే స్థానికుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇంటింటికీ తిరిగి నిర్వహించే సర్వేల నుంచి తమను తప్పించాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగులను మాతృశాఖలకు బదలాయించాలంటున్నారు. ఆదివారాలు, సెలవు రోజుల్లో కూడా ఒత్తిడి తీసుకు వచ్చి ఉద్యోగాలు చేసే విధానానికి స్వస్తి పలకాలంటున్నారు. ఆరేళ్ల పాటు ఒకే క్యాడర్‌ సర్వీస్‌ చేసిన వారికి స్పెషల్‌ ఇంక్రిమెంట్‌, ప్రమోషన్‌ చానెళ్లు ఏర్పాటు చేసి జిల్లాల వారీగా సీనియారిటీ జాబితా విడుదల చేయాలని కోరుతున్నారు.

ఉద్యమానికి సన్నద్ధం

రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యమానికి సచివాలయ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. డిమాండ్ల సాధనకు అధికారులకు వినతిపత్రాలు అందచేసే ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. పలు మండలాల్లో సచివాలయ ఉద్యోగులు మండల స్థాయిలో అధికారులకు నివేదించారు. అయినా సర్కార్‌లో చలనం లేకుండా పోయింది. ఫలితంగా నిరసనల స్థాయి పెంచాలని సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక నిర్ణయించింది. అందుకే 15 రోజుల తర్వాత సమ్మెకు వెళతామని అల్టిమేటం ఇచ్చింది.

ఆత్మగౌరవం లేకుండా పనిచేయలేం

సర్వేల పేరుతో

ఇంటింటికీ తిరగలేకపోతున్నాం

డిమాండ్ల పరిష్కారానికి

సర్కార్‌కు 15 రోజుల డెడ్‌లైన్‌

లేదంటే అక్టోబర్‌ 1 నుంచి

నిరవధిక సమ్మె

సచివాలయ ఉద్యోగుల అల్టిమేటం1
1/1

సచివాలయ ఉద్యోగుల అల్టిమేటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement